India debt: ప్రపంచంలో ఏ దేశమూ స్వయం సమృద్ధి కాదు. కొన్ని ఉత్పత్తులు, వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా రుణం తీసుకోని దేశమూ ఉండదు. ఓ స్థాయి వరకు అప్పులు వల్ల పెద్ద ఇబ్బంది లేదు కానీ శ్రుతి మించితేనే సమస్యలు మొదలవుతాయి. పొరుగునున్న శ్రీలంక, పాకిస్థాన్ లే ఇందుకు మంచి ఉదాహరణ. మరి ఇండియాకి ఉన్న రుణాల లెక్కలేంటో చూద్దాం..

ఇదీ మొత్తం రుణ భారం
మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం రుణాలు సుమారు రూ.155.8 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు లోక్ సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా ఇది GDPలో 57.3 శాతమని అంచనా వేశారు. ప్రస్తుత మారకపు విలువ ప్రకారం.. ఇందులో బాహ్య రుణం రూ.7.03 లక్షల కోట్లు(GDPలో 2.6 శాతం) అంటే పూర్తి అప్పులో 4.5 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. బాహ్య రుణాలను చాలా వరకు బహుపాక్షిక, ద్వైపాక్షిక ఏజెన్సీల ద్వారా సమకూరుస్తారు. అందువల్ల రాయితీ రేట్లు, రిస్క్ తక్కువ మరియు సురక్షితమైనవని వెల్లడించారు.

ఫారెక్స్ సమీకరణకు చర్యలు
కరెన్సీ మారకపు రేటులో అస్థిరతను, అంతర్జాతీయంగా నెలకొన్న అంతరాలను తగ్గించడానికి ప్రభుత్వంతో RBI చర్చలు జరిపినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫారెక్స్ నిధుల సమీకరణ మార్గాలను విస్తరించడానికి ఇటీవల పలు చర్యలను ప్రకటించిందని గుర్తుచేశారు. విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్), నాన్-రెసిడెంట్ (ఎక్స్టర్నల్) రూపీ (NRE) డిపాజిట్ల వడ్డీరేటుపై ఉన్న నియంత్రణ తొలగించబడిందన్నారు.

రూపాయికి పట్టం:
భారతీయ డెట్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు.. వారి పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి పాలనాపరమైన నియంత్రణలను సవరించినట్లు మంత్రి చెప్పారు. బాహ్య వాణిజ్య రుణ పరిమితిని 1.5 బిలియన్ డాలర్లకు పెంచినట్లు తెలిపారు.
వీటికి తోడు దేశీయ ఎగుమతులను ప్రోత్సహించడానికి సైతం RBI చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీకి రూపాయిపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని.. ఎగుమతులు/దిగుమతుల ఇన్ వాయిస్, చెల్లింపులు, సెటిల్ మెంట్ కోసం రూపీ వాడకానికి జూలైలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications