భారత్‌కు భారీగా పెట్టుబడులు: టాప్ 3లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ
గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించడంలో భారత్ చాలా ముందుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 49.97 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం వచ్చిన 44.36 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 13 %అధికం. ఈ విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా సేవల రంగంలోకి వచ్చాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది.

ఏ రంగంలోకి ఎన్ని పెట్టుబడులు
సేవల రంగంలోకి 7.85 బిలియన్ డాలర్లు వచ్చాయి. కంప్యూటర్ సాఫ్టువేర్ అండ్ హార్డ్‌వేర్‌లో 7.67 బిలియన్ డాలర్లు, టెలి కమ్యూనికేషన్స్‌లో 4.44 బిలియన్ డాలర్లు, ట్రేడింగ్‌లో 4.57 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్స్‌లో 2.82 బిలియన్ డాలర్లు, నిర్మాణ రంగంలోకి 2 బిలియన్ డాలర్లు, కెమికల్స్‌లో 1 బిలియన్ డాలర్లు వచ్చినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించే విభాగం (డీపీఐఐటీ) తాజా నివేదికలో తెలిపింది. టాప్ ఫైవ్ సెక్టార్‌లలో సేవలు, కంప్యూటర్ సర్వీసెస్ అండ్ హార్డ్‌వేర్, ట్రేడింగ్, టెలి కమ్యూనికేషన్స్, హోటల్ అండ్ టూరిజం ఉన్నాయి.

ఏ దేశం నుండి ఎంత వచ్చాయి
ఈ విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచి అత్యధికంగా 14.67 బిలియన్ డాలర్లు, మారిషస్ నుంచి 8.24 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ నుంచి 6.5 బిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 4.22 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 3.22 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ నుంచి 1.89 బిలియన్ డాలర్లు వచ్చాయి.

టాప్ 3 రాష్ట్రాలు ఇవే
గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలలో ఎక్కువగా 5.57 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఫిబ్రవరిలో 3.36 బిలియన్ డాలర్లు వచ్చాయి. మహారాష్ట్రకు 30 శాతం పెట్టుబడులు, కర్ణాటకకు 18 శాతం, ఢిల్లీకి 17 శాతం పెట్టుబడులు వచ్చాయి. గత అయిదేళ్లలో అత్యధిక పెట్టుబడులు ఇవే. 2015-16లో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.


Click it and Unblock the Notifications