Byju's layOffs: బైజూస్ ఉద్యోగుల ఊచకోత.. కాల్ వస్తే ఉద్యోగం ఖతమ్..
Byju's layOffs: ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ ఇప్పటికే పలు మార్లు ఉద్యోగులను తొలగించింది. కంపెనీ భారీగా అడ్వర్టైజింగ్, సేల్స్ వంటి విభాగాలకు ఎక్కువ మెుత్తాన్ని వెచ్చించటంతో నష్టాలు కొండలా పేరుకుపోయాయి. ఈ క్రమంలోనే కంపెనీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.

తాజా తొలగింపులు..
భారత ఎడ్ టెక్ సంస్థ బైజూస్ తాజా రౌండ్ లో దాదాపుగా 1000-1200 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఎడ్ టెక్ కంపెనీగా కొనసాగుతున్న బైజూస్ ఖర్చులను తగ్గించుకోవటంలో భాగంగా కఠిన నిర్ణయాలతో ముందుగు సాగుతోంది. ప్రధానంగా కంపెనీ ఆదాయాలు సన్నగిల్లటం, ఫండింగ్ వింటర్ కొనసాగటం కంపెనీకి పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవాలి.

ఈ విభాగాల్లోనే తొలగింపులు..
తాజాగా కంపెనీ ఇంజనీరింగ్, సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ టీమ్స్ విభాగాల్లోని ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అయితే గతంలో ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో పలుమార్లు సీఈవో రవీంథ్రన్ తొలగింపులు ఉండవని పలుమార్లు మెయిల్స్ ద్వారా ఉద్యోగులకు ధైర్యం కలిగించారు. అయితే అక్టోబర్ తర్వాత కొత్త ఏడాది మళ్లీ ఉద్యోగుల తొలగింపులకు కంపెనీ ఉపక్రమించింది.

మ్యాటర్ లీక్ కాకుండా..
ఉద్యోగులకు తొలగింపులకు సంబంధించిన విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపితే లీక్ అవుతాయని కంపెనీ భావించింది. దీంతో ఎవ్వరికీ తొలగింపుల గురించి కంపెనీ మెయిల్ చేయలేదని తెలుస్తోంది. దీనికి బదులుగా తొలగించిన ఉద్యోగులకు కంపెనీ సాధారణ ఫోన్ కాల్ లేదా వాట్సాప్ కాల్ ద్వారా గూగుల్ మీట్ లో పాల్గొనాలని సూచించింది.

మానేయాలంటూ..
గూగుల్ మీట్ ద్వారా తొలగింపు ప్రక్రియను పూర్చి చేస్తున్న కంపెనీ తాము తొలగించటం కంటే స్వతంత్రంగా రాజీమానా చేయాలని ఉద్యోగులకు సూచించినట్లు లేఆఫ్ అయిన ఒక ఉద్యోగి మీడియా వర్గాలకు తెలిపాడు. కంపెనీ తొలగించిందనే మచ్చ కెరీర్ కు మంచిది కాదని అందువల్ల స్వయంగా రిజైన్ చేయటం గౌరవప్రదంగా ఉంటుందని కంపెనీ హెచ్ ఆర్ సూచించినట్లు వెల్లడైంది. ఇలా తొలగించిన వారిని గార్డెన్ పిరియడ్ లో కంపెనీ ఉంచుతోందని తెలిసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభాల బాట పడుతుందని సీఈవో ఆశావహంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications