భారత రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ గ్రూప్ కు చెందిన జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (Jaypee Infratech Ltd)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలు చేపట్టింది. ఈ చర్యలో భాగంగా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ ను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. మనోజ్ గౌర్ నేతృత్వంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్, దాని పెరెంట్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL) దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన భారీ ఆర్థిక మోసం, గృహ కొనుగోలుదారుల నిధుల దుర్వినియోగంలో పాల్గొన్నట్లు తేలింది.
మే 2025లో, ED మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఒక విస్తృత దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో ఢిల్లీ, నోయిడా, ముంబై, లక్నో తదితర నగరాల్లోని 15 ప్రదేశాలపై సమకాలీన దాడులు జరిగాయి. అధికారుల ప్రకారం.. ఈ దాడుల్లో రూ. 1.70 కోట్ల నగదు, అనేక కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంక్ రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది.ఈ దాడులు జేపీ ఇన్‌ఫ్రాటెక్, జైప్రకాష్ అసోసియేట్స్ వాటి అనుబంధ సంస్థలపై ఉన్న మనీ లాండరింగ్, ఆస్తుల మళ్లింపు, అక్రమ ఫండ్ల వినియోగంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగమని చెప్పవచ్చు.

ED దర్యాప్తు ప్రకారం.. జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ గృహ ప్రాజెక్టుల కోసం హోమ్ బయ్యర్ల నుండి సేకరించిన నిధులను అక్రమంగా ఇతర ప్రాజెక్టులకు మళ్లించింది. దీని ఫలితంగా, వేలాది మంది గృహ కొనుగోలుదారులు ఇళ్ల కోసం చెల్లించిన డబ్బును తిరిగి పొందలేక ఇబ్బందుల్లో పడ్డారు. 2017లోనే జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై అనేక గృహ కొనుగోలుదారులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. ఈ కంపెనీ తమ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించిందని, సమయానికి ఫ్లాట్లు అందించలేదని ఆరోపించారు. ఈ కేసులు తరువాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని ఇన్‌సాల్వెన్సీ ప్రాసెస్ (Insolvency and Bankruptcy Code) కింద దర్యాప్తు దశకు చేరాయి.
ED ఆరోపణల సారాంశాన్ని ఓ సారి పరిశీలిస్తే.. Manoj Gaur, జేపీ అసోసియేట్స్ అక్రమంగా ప్రాజెక్టు నిధులను మళ్లించారు. రూ. 12 వేల కోట్ల మోసంలో అనేక అనుబంధ కంపెనీలు పాల్గొన్నాయి.పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. అనుమానాస్పద లావాదేవీలు అనేక బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయి. దర్యాప్తులో డబ్బు మార్పిడి చక్రం (money trail)ను ED గుర్తిస్తోంది.
జేపీ ఇన్‌ఫ్రాటెక్ 2000ల ప్రారంభంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖంగా ఎదిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో కంపెనీ పేరు గాంచింది. అయితే, 2015 తర్వాత డెబ్ట్ బరువుతో, ప్రాజెక్టుల ఆలస్యాలతో కంపెనీ సమస్యల్లో పడింది. 2017లో ఇన్‌సాల్వెన్సీ ప్రాసెస్ కింద దాఖలైన తర్వాత అనేక ప్రయత్నాలు పునరుద్ధరణకు జరిగాయి. అయితే అవేమి విజయవంతం కాలేదు. ఇప్పుడు ED అరెస్ట్‌తో కేసు కొత్త దిశలోకి వెళ్లింది. అధికారులు మనోజ్ గౌర్‌ను విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని ఆర్థిక లావాదేవీలు, నిధుల మార్గం, ఇతర ప్రమోటర్ల పాత్ర బయటపడే అవకాశముంది.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ అరెస్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి స్పష్టమైన సందేశం అని చెప్పవచ్చు.పెట్టుబడిదారుల డబ్బు దుర్వినియోగం పట్ల కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరిక వచ్చినట్లయింది.


Click it and Unblock the Notifications