కరోనా తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం రూపంలో భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా కాస్త ఎదురుగాలి ఉన్నప్పటికీ, 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆర్థిక స్థిరత్వ నివేదిక తెలిపింది. అలాగే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) ఆరేళ్ల కనిష్టానికి చేరాయని పేర్కొంది. అలాగే, రుణాలకు డిమాండ్ పెరుగుతుందని వెల్లడించింది.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరిగిన ఉత్పత్తుల ధరలు, ముఖ్యంగా పెరిగిన ముడి చమురు ధరలు, అస్థిర ఆర్థిక పరిస్థితులు ప్రపంచ, భారత మార్కెట్లను అశాంతికి గురి చేస్తున్నాయి. ఈ ప్రభావం భారత్ పైన ఉంది. ఇక కార్పోరేట్ అమ్మకాలు, లాభదాయకత పెరిగినప్పటికీ కాపెక్స్ సైకిల్ అస్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక సమస్యలను జాగ్రత్తగా ఎదుర్కోవాలని, పరిస్థితిని సునిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఆర్బీఐ తన 25వ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పలు అంశాలను పొందుపరిచింది. ప్రతికూల పరిణామాలను తట్టుకోవడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీల వద్ద సరిపడా మూలధన నిల్వలు ఉన్నట్లు తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్భణానికి కళ్లెం వేసేందుకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపులు, కరోనా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2022 మార్చికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల సీఆర్ఏఆర్ కొత్త గరిష్టమైన 16.7 శాతానికి చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications