ఆర్థిక వ్యవస్థ, రికవరీపై సెకండ్ వేవ్ ప్రభావం: సీఈఏ సుబ్రమణియన్
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని, అయితే అది అంత తీవ్రంగా ఉండదని చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ సుబ్రమణియన్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో పోలిస్తే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విధించే లాక్ డౌన్, కరోనా ఆంక్షలు అంత తీవ్రమైనవి కావని అభిప్రాయపడ్డారు. మొత్తానికి సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థపై గతంలో కంటే తక్కువ ప్రభావం చూపిందన్నారు.
సెకండ్ వేవ్ గృహ వినియోగదారులపై మరింత భారం వేసిందని, ఇది వారి ఖర్చులపై ప్రభావం చూపుతోందన్నారు. అసంఘటిత రంగం, భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో అండగా ఉంటోన్న ఎంఎస్ఎంఈలు గత ఏడాదిన్నరగా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని, అవి తమను తాము నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కరోనా వ్యాక్సినేషన్, మహమ్మారిని నియంత్రించడంపై రాబోయే త్రైమాసికాల్లో భారత వృద్ధి రేటు ఆధారపడి ఉందన్నారు.

ఇది వ్యాపారం, వినియోగదారుల సెంటిమెంట్ పైన నేరుగా ప్రభావం చూపిస్తుందని, అలాగే వినియోగం, పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ఇదిలా ఉండగా, గత పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను (2020-21) భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 7.3 శాతం నమోదయింది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 1.6 శాతం సానుకూల వృద్ధి నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సోమవారం సంబంధిత గణాంకాలను వెలువరించింది. భారత జీడీపీ గణాంకాలు కాస్త సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక రికవరీ మరికొద్ది నెలల దూరంలో కనిపిస్తోందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications