3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు, వాణిజ్య చర్చల్లో పురోగతి.. అంతే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య వివిధ అంశాలపై ఒప్పందం జరిగింది. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు.
ట్రంప్ భారత్ పర్యటన, మరిన్ని కథనాలు

ఇవీ ఒప్పందాలు..
రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఇంధన రంగంలో సహకారానికి, ఇండియన్ ఆయిల్ ఎక్సాన్ మొబిల్ మధ్య ఒప్పందం, వైద్య ఆరోగ్య రంగంలో మరింత సహకారం, నాణ్యమైన మందుల సరఫరాకు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు తదితర అంశాలపై ఒప్పందం చోటుచేసుకుంది.

అపాచీ, ఎంహెచ్ 60 హెలికాప్టర్లు
మూడు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కింద అపాచీ, ఎంహెచ్ 60 రోమియో వంటి ఆధునాతన హెలికాప్టర్లను అందజేస్తుంది అమెరికా. ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుంది.

సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా..
సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాలు జరుపుతున్న చర్చల్లో ఎంతో పురోగతి సాధించామని ట్రంప్ వెల్లడించారు. త్వరలో గొప్ప ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్‌కు అమెరికా చేస్తున్న ఎగుమతుల్లో 60 శాతం వృద్ధి నమోదయినట్లు చెప్పారు. నాణ్యమైన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులు 500 శాతం పెరిగాయన్నారు.

చర్చలు సానుకూలంగా..
ఇరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు చర్చలు జరుపుతున్నారని, ఇవి సానుకూలంగా సాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ వాణిజ్య చర్చలకు తుది రూపు రావాలని తాము కోరుకున్నామని చెప్పారు. ఓ పెద్ద వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించామన్నారు.

ప్రకటనతో సరిపుచ్చారు..
ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా భారీ ఒప్పందాలు, ఇరుదేశాల నుండి గత కొన్నాళ్ళుగా ఉన్న పలు డిమాండ్లపై చర్చలు ఉంటాయని చాలామంది భావించారు. అలాగే, టారిఫ్ అంశం కీలకం కానుందని భావించారు. కానీ ఊహించినంత భారీ ఒప్పందాలు లేకుండానే ట్రంప్ పర్యటన ముగియనుంది. అలాగే, గత కొన్నాళ్లుగా ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. దీనికి ముగింపు పడుతుంది లేదా మరింత ముందుకు వెళ్తుందని భావించారు. కానీ ట్రంప్ కేవలం పురోగతి సాధించామనే ప్రకటనతో సరిపుచ్చారు.


Click it and Unblock the Notifications