Paytm..కలిసి రాని కాలం: డిజిటల్ చెల్లింపుల కాలంలోనూ రూ.కోట్లల్లో లాస్
ముంబై: డిజిటల్ చెల్లింపు కంపెనీ పేటీఎం (Paytm) భారీ నష్టాన్ని చవి చూసింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల మీదే ఆధారపడినప్పటికీ- పేటీఎం కంపెనీ మాత్రం నష్టాలను చవి చూడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే.. గత ఏడాది నమోదైన ఆదాయంలో 10 శాతం మేర క్షీణత కనిపించింది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను పేటీఎం యాజమాన్యం విడుదల చేసింది. బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు దీన్ని పంపించింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎం సంస్థకు 1,704 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే.. 10 శాతం మేర తక్కువగా ప్రాఫిట్‌ను నమోదు చేసిందా డిజిటల్ పేమెంట్ ఫిర్మ్.

2019-2020 ఆర్థిక సంవత్సరంలో 3,540.77 కోట్ల రూపాయల రాబడి నమోదు కాగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ సంఖ్య 3,186 కోట్లకు క్షీణించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,943.32 కోట్ల నష్టాన్ని చవి చూసింది. గత ఏడాదికి ఈ సంఖ్య 1,704 కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్ వల్ల లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని పేటీఎం తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ద్వితీయార్థంలో అన్‌లాక్ చర్యల వల్ల తాము పుంజుకోగలిగామని, డిజిటల్ చెల్లింపులు అంచనాలకు అనుగుణంగా నమోదయ్యాయని తెలిపింది. కరోనా భయం వల్ల డిజిటల్ చెల్లింపుల మీద వినియోగదారులు ఆధారపడటం వల్ల ద్వితీయార్థంలో కార్యకలాపాలు విస్తృతంగా సాగాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించాయని, వాటి ప్రభావం కూడా తమపై పడినట్లు అంచనా వేసింది.


Click it and Unblock the Notifications