దీపావళి నుండి దీపావళికి.. పసిడి రూ.13,000కు పైగా జంప్: డిమాండ్ పెరిగితే ధరలు కూడా జంప్!
దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలు బహుమతులు కొనుగోలు చేస్తాయి. దీంతో సేల్స్ ఎక్కువగా ఉంటాయి. కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వడంతో పాటు బహుమతులు ఇస్తాయి. కరోనా నేపథ్యంలో ఇటీవలి వరకు ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీంతో ఈసారి కొనుగోళ్లు ఉంటాయని భావిస్తారు. అయితే గత ఏడాదితో పోలిస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయి.

రూ.13,000కు పైగా జంప్
గత దీపావళి నుండి ఈ దీపావళి వరకు పసిడి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి గత దీపావళి సమయంలో రూ.40వేల దిగువన పలికింది. ఈ దీపావళికి రూ.52వేలు దాటింది. ప్రాంతాన్ని బట్టి రూ.51వేల నుండి రూ.53వేలు పలుకుతోంది. అంటే దాదాపు రూ.13,000 పెరిగింది. అయితే కరోనా నేపథ్యంలో రూ.58వేలు దాటిన పసిడి ఇప్పుడు రూ.5వేలకు పైగా తక్కువగా ఉంది. ధరలు ఎక్కువగాఉండటం, కరోనా మందగమనం నేపథ్యంలో కొనుగోళ్లు గతంలో వలె కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత బంగారం మార్చి కొత్తవి కొనుగోలు చేసేలా ఆఫర్లు ఇస్తున్నారు. 2018 దీపావళి సమయానికి రూ.33,000 ఉన్న 10 గ్రాముల పసిడి, 2019 నాటికి రూ.39,000, 2020 నాటికి రూ.52,000కు పైగా ఉంది.

డిమాండ్ పుంజుకుంటే ధరలు పెరగొచ్చు
మన దేశంలో దసరా, దీపావళి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి సమయంలో పసిడికి డిమాండ్ సహజం. ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్లు కాస్త తగ్గుతాయేమో.. కానీ సేల్స్ మాత్రం కాస్త ఆశాజనకంగా ఉంటాయి. దేశంలో గోల్డ్ ప్రీమియం మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. దీపావళి సీజన్‌లో సేల్స్ బాగుంటాయని జ్యువెల్లరీ యజమానులు ఆశతో ఉన్నారు. పసిడి ధరలు ఈ ఏడాది 25 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఇది సురక్షిత పెట్టుబడి కావడం, మంచి రిటర్న్స్ రావడం సేల్స్‌కు దోహదపడతాయి. డిమాండ్ పెరిగితే ధరలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కలిసి వస్తుందని భావించినప్పటికీ...
ఈ ధనత్రయోదశి కలిసి వస్తుందని భావించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే సేల్స్ 30 శాతం తగ్గుతాయని కూడా రిటైల్ వ్యాపారులు భావిస్తున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత ఏడాది 20 శాతానికి పైగా సేల్స్ క్షీణించాయి. ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.4వేల నుండి రూ.5వేల వరకు తగ్గడం, కొంతకాలంగా స్థిరంగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయమని అంటున్నారు. ఈ రోజు బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయ. మధ్యాహ్నం గం.3.15 సమయానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ రూ.64 పెరిగి రూ.50,664 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.90 పెరిగి రూ.50,763 వద్ద ట్రేడ్ అయింది. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.71 పెరిగి రూ.62,810 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.43 పెరిగి రూ.64,500 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1878 వద్ద, సిల్వర్ 24 డాలర్లు పలికింది.


Click it and Unblock the Notifications