అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకులు రాధాకిషన్ ధమానీ మరో స్థానం పైకి చేరుకున్నారు. ఇటీవలే ఇండియన్ టాప్ 10 కుబేరుల్లో 6వ స్థానంలో నిలిచిన ఇతను ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకారు. 13.30 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన లక్ష్మీమిట్టల్ (13.10 బిలియన్ డాలర్లు), గౌతమ్ అదానీ (10.9 బిలియన్ డాలర్లు), సునీల్ మిట్టల్‌ను (9.62 బిలియన్ డాలర్లు) దాటేశారు.

ఆల్ టైమ్ గరిష్టానికి షేర్ ధర
ఫిబ్రవరి 13వ తేదీన అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి-మార్ట్) షేర్లు 2,559తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. గతవారంలో ఫిబ్రవరి 5వ తేదీన కంపెనీ సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం షేర్ల విక్రయాన్ని ప్రకటించింది. అలాగే, తమ ప్రమోటర్లు 2.28 శాతం షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తారని, దీంతో రూ.3,032 కోట్లు వస్తాయని తెలిపింది.

ప్రమోటర్ల షేర్లు సేల్
ప్రమోటర్లు రాధాకిషన్ ధమానీ, గోపీకిషన్ ఎస్ ధమానీ, శిఖాంతదేవి ఆర్ ధమానీ, కిరణ్ దేవి జీ దమానీలు 1.48 కోట్ల షేర్లను విక్రయిస్తారని తెలిపారు. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేర్ ధర రూ.2,049 వద్ద మొత్తం రూ.4వేల కోట్లను సమీకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి 14న, రిటైల్ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి 17న బిడ్ దాఖలు చేయవచ్చు.

తక్కువ ధరకు గ్రాసరీ
అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి-మార్ట్ మార్చి 21, 2017న రూ.39,988 కోట్ల వ్యాల్యూతో లిస్టింగ్ చేయబడింది. అప్పటి నుంచి రూ.1.60 లక్షల కోట్లకు ఎదిగింది. దేశంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ అత్యంత లాభదాయకమైన కిరాణా రిటైలర్. 196 దుకాణాల ద్వారా కస్టమర్లకు గ్రాసరీ సేవలు అందిస్తోంది. తక్కువ ధరలకు వీటిని అందిస్తూ ఆదరణ పొందింది.

రూ.1 లక్షకు రూ.8 లక్షలు
కాగా, లిస్టింగ్ తేది నుంచి ఇటీవల సోమవారం ముగింపు నాటికి షేర్ ధర 290% పెరిగింది. ఈ ఏడాదిలో కంపెనీ మొత్తంగా 35% ర్యాలీ చేసింది. 21 మార్చి 2017న కంపెనీ నమోదయింది. ఏకంగా రూ.39,988 కోట్ల మార్కెట్ వ్యాల్యూను సొంతం చేసుకుంది. ఒకవేళ లిస్ట్‌లో ఒక ఇన్వెస్టర్ రూ.1లక్షల విలువ చేసే షేర్లను కొనుగోలు చేస్తే సోమవారం ముగింపు సమయానికి సదరు ఇన్వెస్టర్ మొత్తం రూ.8.31లక్షలను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications