రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డిజిటల్ కరెన్సీ (CBDC-కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ)ని తీసుకు వచ్చేందుకు వర్కవుట్ చేస్తోందని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోకసభకు వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్రం క్రిప్టో బిల్లును తీసుకు వస్తుందనే వార్తలు మొదటి నుండి వినిపిస్తోన్న విషయం తెలిసిందే. సమావేశాల తొలిరోజు ఆర్థిక శాఖ కీలక అంశాన్ని వెల్లడించింది. డిజిటల్ కరెన్సీని గుర్తించేలా బ్యాంకు నోటు నిర్వచన పరిధిని విస్తరించాలని ఆర్బీఐ నుండి అక్టోబర్ నెలలో ప్రతిపాదనలు అందాయని, ఈ మేరకు 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1934 చట్టం'లో సవరణలు చేయాలని సూచించినట్లు స్పష్టం చేసింది. శీతాకాల సమావేశాల తొలిరోజే క్రిప్టో కరెన్సీ నిషేధం, ఆర్బీఐ అధికారిక డిజిటల్ కరెన్సీ అంశం గురించి ప్రభుత్వానికి ప్రశ్న ఎదురైంది. దీనిపై ప్రభుత్వం నుండి సమాధానం వచ్చింది.
కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయా, దీనిని ఎలా అమలు చేయబోతున్నారని ప్రశ్నలు వచ్చాయి. దీనికి కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం చెప్పారు. డిజిటల్ కరెన్సీ వినియోగానికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతం పలు కేస్ స్టడీలను పరిశీలిస్తోందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా సీబీడీసీని ప్రవేశపెట్టడానికి దశలవారీగా అమలు వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

సీబీడీసీ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని, నగదుపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. అలాగే మరింత కచ్చితమైన, సమర్థవంత, విశ్వసనీయ, నియంత్రిత, చట్టపరమైన చెల్లింపులకు అవకాశముందన్నారు. నియంత్రించలేని క్రిప్టో వల్ల దేశ దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురికావొచ్చని పంకజ్ చౌదరి తెలిపారు. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్లు లోకసభ బులిటెన్ నోటిఫై చేసింది.


Click it and Unblock the Notifications