10 మందిలో ఒకరి ఉద్యోగం పోతుందట! చేయాల్సింది చాలా ఉంది..

మాయదారి కరోనా మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టేలా లేదు. చైనా లో మొదలైన ఈ ప్రాణాంతక వ్యాధి నేరుగా తీసే ప్రాణాలకన్నా... పరోక్షంగా అధిక సంఖ్యలో ప్రాణాలను బలిగొనేలా ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 48 లక్షల మందికి సోకి, దాదాపు 3.20 లక్షల మంది ఊపిరి తీసింది. భారత్ లోనూ విలయ తాండవం చేస్తూ 90,000 కు పైగా మందికి ఈ వ్యాధి సోకింది. ఇప్పటికే సుమారు 2,900 మంది ప్రాణాలను బలి తీసుకుంది.

అందుకే దేశంలో అంతకంతకూ లాక్ డౌన్ పొడిగిస్తూ పోతున్నారు. దీనిని నాలుగో సారి పొడిగించి తాజాగా ఈ నెల 31 వరకు అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడుకోవటం కోసం దేశం ఈ విధంగా ముందుకు సాగుతోంది. కానీ, ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. దేశ ప్రజల్లో సుమారు 70% మంది తమ తమ ఇండ్లకే పరిమితం కావటంతో పెద్ద ఎత్తున ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు.

వలస కార్మికులు రెండు విధాలా దెబ్బతింటున్నారు. ఒకవైపు పనిలేదు. మరో వైపు సొంత ఊర్లకు వెళ్లిపోవాలన్న ఆకాంక్ష వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తోంది. ఊరికి చేరేలోపే చాలా మంది కార్మికులు అసువులు బాస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులు వెంటనే సర్దుకునే అవకాశాలు కనిపించటం లేదు.

జాబ్స్ ఉఫ్...

జాబ్స్ ఉఫ్...

దేశంలో త్వరలోనే అతిపెద్ద సంక్షోభం మొదలవబోతోంది. కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన దేశీయ ఆర్థిక వ్యవస్థలో ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోనున్నారు. ఓ సర్వే ప్రకారం సుమారు 13.5 కోట్ల ఉద్యోగాలు పోనున్నాయి. 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 13.5 కోట్ల మంది ఉద్యోగాలు పోతాయంటే... ప్రతి 10 మందిలో ఒకరికి ఉపాధి కరువు అవుతుందన్నమాట.

ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దేశ జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 10.8% తగ్గుతుందని ఆర్థర్ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత ఏడాదిలో జీడీపీ కొంత పుంజుకుని 0.8% మేరకు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని అంచనా. అయితే, కరోనా వైరస్ తదనంతర పరిణామాలతో దేశం ఆర్థికంగా బాగా దెబ్బతింటోందని అర్థమవుతోంది.

మూడు పూటలా భోజనం చేసేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి

మూడు పూటలా భోజనం చేసేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి

ఎన్నో ఏళ్లుగా భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకున్నాం. కానీ ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. కొన్నేళ్లుగా దేశంలో పేదరికం బాగా తగ్గించామని ప్రభుత్వాలు ఘంటాపథంగా చెప్పుకుంటున్నాయి. కానీ... అందులోని డొల్లతనం ఇప్పుడు కరోనా రూపంలో సాక్షాత్కరించింది. ఎందుకంటే... కేవలం రెండు- మూడు నెలల లాక్ డౌన్ కారణంగా దేశంలో మరో 12 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుకోబోతున్నారు. ఉపాధి కరువు అవుతుండటం, అప్పుల బాధలు, తినడానికి తిండి దొరకని పరిస్థితిలో వీరంతా కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుండటం దేశానికి సిగ్గుచేటు. కరోనా వల్ల పేదరికపు విష వలయంలోకి పడిపోతున్నఈ 12 కోట్ల మందితో కలిపితే దేశంలో మొత్తం పేదల సంఖ్య 40 కోట్లకు పెరగబోతోంది. అంటే దేశంలో 30% నికి పైగా ప్రజలు మూడు పూటలా భోజనానికి కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొనబోతోంది.

చేయాల్సింది చాలా ఉంది...

చేయాల్సింది చాలా ఉంది...

కరోనా వైరస్ దెబ్బ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, కుదేలైన పారిశ్రామిక రంగానికి ప్యాకేజీ ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఇంకా చేయాల్సింది చాలానే ఉందని ఆర్థర్ నివేదిక అభిప్రాయపడింది. దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 10% నికి సమానంగా రూ 20 లక్షల కోట్లతో రక రకాల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ లు ప్రకటించిన కేంద్రం... తద్వారా దేశ ఎకానమీ కి కొత్త జవసత్వాలు అందించాలని భావిస్తోంది. వ్యవసాయం నుంచి సేవల రంగం వరకు దాదాపు అన్ని రంగాలు, వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా విధి విధానాలను ప్రకటించింది. ఇదే అదునుగా కొన్ని సంస్కరణలను కూడా అమలు చేసేందుకు పావులు కదిపింది. అయితే ఇవన్నీ కూడా వాస్తవికంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలవా లేవా అనేది మాత్రం కాలమే తేలుస్తుంది. అప్పటిదాకా ఏం జరుగుతుందో చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+