70% పడిపోయిన పెట్రోల్, డీజిల్ డిమాండ్, ఎల్పీజీ గ్యాస్ మాత్రమే..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. దేశంలోని జనాలు ఇళ్ళకే పరిమితమయ్యారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణా సంస్థ స్తంభించిపోయింది. దీంతో మన దేశంలో చమురు వినియోగంభారీగా పడిపోయింది. చమురుశుద్ధి సంస్థలతో పాటు ఉత్పత్తి సంస్థలపై ఈ ప్రభావం పడింది. లాక్ డౌన్ సమయంలో చమురు డిమాండ్ 70 శాతం వరకు పడిపోయిందని అంచనా.

మూడు దేశాల వినియోగమే 40 శాతం
ప్రపంచంలోనే చమురు వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉంది. చైనా, అమెరికా తర్వాత అత్యధిక స్థాయిలో వినియోగించే దేశం మనదే. ఈ మూడు దేశాల చమురు వినియోగం దాదాపు 40 శాతం ఉంటుంది. ఈ నెల మొత్తం వినియోగం గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే దాదాపు 50% కంటే తక్కువకు పడిపోయినట్లు చమురు కంపెనీల అంచనా.

పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గింది
ఇలా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా, వస్తుసేవలు నిలిచిపోవడంతో దాదాపు 66 శాతం పెట్రోల్, నలభై శాతం డీజిల్ డిమాండ్ తగ్గిపోయి ఉంటుంది. కేవలం ఎల్పీజీ మాత్రమే డిమాండుకు సరిపడాస్థాయిలో సరఫరా అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల బ్యారెల్స్ చమురు డిమాండ్ తగ్గిందని అంచనా. మన దేశంలోనే ముప్పై లక్షల బ్యారెళ్ల ఆయిల్ డిమాండ్ తగ్గినట్లు అంచనా.

పదేళ్ల తర్వాత తొలిసారి
చమురు వినియోగం పదేళ్ల తర్వాత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. లాక్ డౌన్‌తో పెట్రోల్, డీజిల్ వాడకం 66% తగ్గగా, అదే విమాన ఇంధనం వాడకం 90% పడిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. 2019 లెక్కల ప్రకారం భారత్ ప్రతిరోజు 44 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగిస్తుంది. ఇందులో 7 లక్షల బ్యారెళ్ల పెట్రోల్, 18 లక్షల బ్యారెళ్ల డీజిల్ ఉంటుంది.

తిరిగి పుంజుకుంటుంది.. కానీ
డిమాండ్ తగ్గిందని, కానీ పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి పుంజుకుంటుందని, అయితే అప్పుడే ఇదివరకు ఉన్నంత డిమాండ్ ఉండకపోవచ్చునని, క్రమంగా డిమాండ్ పుంజుకుంటుందని, దీనికి సమయం పడుతుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణం కంటే 30 శాతం నుండి 40 శాతం డిమాండ్ మాత్రమే ఉందన్నారు.


Click it and Unblock the Notifications