భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తగ్గించేందుకు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించాలని పారిశ్రామిక, కార్పోరేట్ వర్గాలు ప్రధాని మోడీని కోరాయి. బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిన రుణాల చెల్లింపుపై కూడా మారటోరియం విధించాలని, పన్ను రాయితీలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ మేరకు భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాని మోడీ సోమవారం ఎనిమిది నగరాల్లోని ASSOCHAM, FICCI, CII, ఇతర లోకల్ ఛాంబర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ సహా ఇలా చేయండి..
కరోనా కారణంగా పర్యాటకరంగం, హాస్పిటాలిటీ, ఏవియేషన్, రెస్టారెంట్ బిజినెస్ భారీ ఒత్తిడిలో ఉందని పారిశ్రామిక వర్గాలు ప్రధానికి విన్నవించాయి. కరోనా ద్వారా ఎదుర్కొనే కష్టాలు ఎదుర్కొనేందుకు రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ కావాలని పారిశ్రామిక రంగం కోరింది. పన్ను రెట్లు తగ్గించాలని, బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల చెల్లింపు వాయిదా వేయాలని కోరాయి.

జీడీపీ పడిపోయే ఛాన్స్
రూ.2 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ పథకం ద్వారా ప్రజలకు బదిలీ చేయాలని సీఐఐ కోరింది. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని లేదంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతాని కంటే దిగువకు పడిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.

అలా రూ.4 లక్షల కోట్లు వస్తాయి..
ప్రభుత్వం ద్రవ్యలోటుపై ఆందోళన చెందకుండా, లక్ష్యాన్ని రెండు శాతం పెంచాలని, దీంతో వ్యవస్థలో రూ.4 లక్షల కోట్లు వస్తాయని ఫిక్కీ ప్రధాని మోడీకి సూచించింది. కరోనాపై పోరాటంలో నిత్యావసరాలు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, ఔషధాలను తయారీ పెంచేందుకు తమ ప్లాంట్లను కేటాయిస్తామని చెప్పింది. సత్వర చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు ప్రధానిని కోరాయి.

ఆర్థిక మంత్రికి NRAI లేఖ
జీఎస్టీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, కస్టమ్ డ్యూటీ చెల్లింపులు కేంద్ర ప్రభుత్వా వాయిదా వేయాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది.


Click it and Unblock the Notifications