కరోనా మహమ్మారి ప్రభావం భారీగానే కనిపిస్తోంది. కరోనా-లాక్ డౌన్ అనంతరం బిజినెస్ డిమాండ్ వంటి వివిధ కారణాలతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వివిధ సర్వేలు వెల్లడించాయి. ఐటీ సేవా సంస్థల్లో ఉద్యోగాల కోత లేకపోవడంతో పాటు ఫ్రెషర్స్‌ను కూడా తీసుకుంటామని ప్రకటనలు వస్తున్నాయి. కానీ బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై కరోనా ప్రభావం కోలుకోని విధంగా పడింది. తాజాగా, దిగ్గజ బ్యాంకు హెచ్ఎస్‌బీసీ ఏకంగా 35,000 మంది ఉద్యోగుల నుండి తొలగించేందుకు సిద్ధమవుతోందట. ఇంతమంది ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో కరోనా ప్రభావం అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు.

ఉద్యోగాల కోత.. నియామకాల్లేవు
HSBCలో భారీస్థాయిలో ఉద్యోగుల్ని తొలగించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా 2.35 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 35 వేల మందిని తొలగించనుందట ఈ దిగ్గజ బ్యాంకు. అంటే దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం పోతుందని తెలుస్తోంది. అయితే కొంత సమయం పట్టవచ్చునని తెలుస్తోంది. అదే సమయంలో కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టడం లేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు పంపిన మెమోలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియోల్ క్విన్ పేర్కొన్నారు.

వాయిదా పడిందా.. లేక
వాస్తవానికి హెచ్ఎస్‌బీసీలో కరోనా మహమ్మారి కంటే ముందుగానే ఉద్యోగులను తొలగించాల్సి ఉందని తెలుస్తోంది. దీనికి తోడు వైరస్ ప్రభావం పడింది. ప్రస్తుతానికి అయితే ఇది వాయిదా పడిందని, భవిష్యత్తులో తొలగింపు ఉంటుందని చెబుతున్నారు. మెమోలోని ఉద్యోగుల తొలగింపు అంశం వాస్తవమేనని బ్యాంకు అధికారి ఒకరు ధృవీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఉద్యోగ నష్టాలను తాము ఎప్పటికీ పాజ్ చేయలేమని, ఇది ఎప్పుడో చెప్పలేమని నియోల్ క్విన్ ఫిబ్రవరిలోనే చెప్పారు.

అందుకే వాయిదా కానీ..
ఉద్యోగాల కోత ద్వారా 4.5 బిలియన్ డాలర్లు ఖర్చులు తగ్గించే ప్లాన్‌ను హెచ్‌ఎస్‌బీసీ మార్చి నెలలో వాయిదా వేసింది. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో ఉద్యోగులను పంపించివేయడం సరికాదనే ఉద్దేశ్యంతో ఆగిపోయిందట. అయితే కరోనా కారణంగా లాభాలు పడిపోవడం, ఆర్థిక అంచనాలు తలకిందులైన నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తున్నారట. ఈ సంవత్సరం రెండో భాగంలో వ్యయ నియంత్రణ చేపట్టనున్నారు.

వీరిపై ఎక్కువ ప్రభావం
హెచ్ఎస్‌బీసీ గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్ డివిజన్‌లో ఎక్కువగా బ్యాక్ ఆఫీస్ ఉద్యోగాలకు కోత పడే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ట్రేడింగ్ బిజినెస్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మార్చి నెల ప్రారంభం నుండి ఈ బ్యాంకు షేర్లు 27 శాతం పడిపోయాయి. ఈ బ్యాంకులో ఓ స్థాయిలో 3,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వ్యాపారాలు విక్రయించింది. 2016 నాటికి బ్రెజిల్ సహా కొన్ని దేశాలను వదిలేసింది. ఇప్పుడు 2,35,000 మంది ఉద్యోగులు ఉన్నారు.


Click it and Unblock the Notifications