భారత్ ఆటోషోకు కరోనా వైరస్ దెబ్బ, చైనీయుల పర్యటన రద్దు?
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వివిధ దేశాలు చైనాకు విమానాలను నిలిపివేశాయి. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై దృష్టి సారించారు. చైనాలో పరిశ్రమలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది. కరోనా ప్రభావం భారత్‌లో నిర్వహించనున్న ఆటో షోపై కూడా పడనుంది.

భారత్‌పై ప్రభావం ఉంటుందా అంటే?
చైనాలోని కరోనా వైరస్ కారణంగా భారత్ ఆటో సెక్టార్‌పై ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. భారత్ అంతర్జాతీయ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడలేదని, కాబట్టి మన దేశం ప్రభావితమయ్యే అవకాశాలు తక్కువ అంటున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం దాదాపు ఇరవై దేశాల్లో కనిపించింది. మన ఆటో రంగంపై కరోనా వైరస్ ప్రభావం అంతగా ఉండదని మారుతీ సుజుకీ చైర్మన్ అన్నారు.

ఆటో ఎక్స్‌పోపై కరోనా ప్రభావం
అయితే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... ఈ వారంలో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో 2020పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. భారత్‌లో రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఆటో షో, ఆటో విడిభాగాల ఎగ్జిబిషన్‍లో ఈసారి చైనా కంపెనీలు పెద్ద ఎత్తున పాల్గొననున్నాయని వాహన పరిశ్రమ ప్రకటించింది. ఎంజీ మోటార్స్, గ్రేట్ వాల్ మోటార్స్, బీవైడీ వంటి చైనా కంపెనీలు ఈ ఆటో షోలో తమ కొత్త మోడల్స్‌ను ప్రదర్శించనున్నాయి.

కరోనా వైరస్ కారణంగా తారుమారు
గతంలోను చైనా కంపెనీలు ఆటో ఎక్స్‌పోలో పాల్గొన్నప్పటికీ పెద్ద సంఖ్యలో సంస్థలు రానుండటం ఇదే మొదటిసారి. విడిభాగాల ఎగ్జిబిషన్‌లో 200కు పైగా చైనా కంపెనీలు పాల్గొంటాయని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. కానీ కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి.

అనిశ్చితి
ఆటో షోలో చైనా కంపెనీల ప్రాతినిథ్యంపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పలు చైనా వాహన సంస్థల ప్రతినిధులు తమ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఆటోషో వివరాల్ని రిపోర్ట్ చేసేందుకు భారత్‌కు రావాల్సిన జర్నలిస్టులు కూడా టూర్ రద్దు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. చైనాకు కేటాయించిన స్టాల్స్‌ను ఇంకా రద్దు చేయలేదని చెబుతున్నారు. కానీ కరోనా ప్రభావంతో ఆటోషోలో ఆ దేశ కంపెనీలు పాల్గొనే అవకాశం తక్కువే అంటున్నారు.


Click it and Unblock the Notifications