కరోనా 'బోనస్': ఈ కంపెనీ ఉద్యోగులకు బోనస్, 1,000 డాలర్లు ప్రకటించిన ఫేస్‌బుక్
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 13వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్జాతీయంగా అంతా స్తంభించిపోయింది. ఐటీ సంస్థలు అన్నీ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. వర్క్ ఫ్రమ్ పరిస్థితి లేని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇచ్చాయి. కంపెనీలు లాప్‌టాప్ ఇవ్వడం లేదా ఉద్యోగులకు లాప్‌టాప్ ఉంటే ఇంటి వద్ద నుండి పని చేయిస్తున్నాయి. మరో విషయమేమంటే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ కూడా ఇస్తున్నాయి.

రెండు వారాల వేతనం బోనస్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు రెండు వారాల వేతనాన్ని బోనస్‌గా అందించింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ బోనస్ ఇచ్చింది. ఈ వైరస్ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో ఉద్యోగులకు ఇబ్బందులు రావొద్దని వర్క్‌డే ఫైనాన్షియల్ అనే కంపెనీ రెండు వారాల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చింది.

ఉద్యోగులకు ఊతమివ్వడానికి..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సేవలు క్లోజ్ అయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు ఆర్థిక ఊతమివ్వడం చాలా అవసరమని, తమ ఉద్యోగులను బాగా చూసుకుంటే మా వినియోగదారులను కూడా చూసుకున్నట్లేనని, అనుకోని ఈ విపత్తు సమయంలో తమ ఉద్యోగులకు అండగా నిలబడటం చాలా కీలకమని వర్క్ డే కంపెనీ ప్రకటించింది.

ఫేస్‌బుక్ కూడా..
కరోనా వైరస్ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా తమ ఉద్యోగులకు 1,000 డాలర్ల చొప్పున ఇస్తామని ఇటీవల ప్రకటించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులకు అండగా ఉంటామని ప్రకటించింది.

45 వేలమంది ఉద్యోగులకు..
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో 44,900 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. వివిధ కార్యాలయాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఫేస్‌బుక్ సహా వివిధ టెక్ సంస్థలు ఇంటి నుండే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పిల్లల కోసం ఏదైనా కొనుగోలు చేయడానికి, ఇతర అవసరాలకు 1000 డాలర్లు ఇస్తామని తెలిపింది.

వర్క్ ఫ్రమ్ హోమ్.. వేతనాల చెల్లింపు..
తెలుగు రాష్ట్రాల్లోను ఎన్నో టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. వారం రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని, ఈ సమయంలో ఒప్పంద ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ వేతనాలు ఇస్తామని చెప్పారు. ఈ లాక్ డౌన్ పీరియడ్‌లో ప్రయివేటు ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించాల్సిందేనని చెప్పారు.


Click it and Unblock the Notifications