కరోనా వైరస్ కారణంగా గత కొంతకాలంగా తీవ్ర నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. సోమవారం ఆసియా మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. భారత మార్కెట్ కూడా భారీగా ఎగిసి, రెండు కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో 153 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. లేదంటే మన మార్కెట్లు కూడా స్వల్ప లాభాల్లో ఉండేవేమో. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు, కేంద్ర బ్యాంకులు సిద్ధపడ్డాయి. జపాన్ బ్యాంకు కూడా ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు లాభపడ్డాయి.

2009 మందగమన పరిస్థితులు..
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమార్కెట్లు అతలాకుతలమయ్యాయి. 2009 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని గుర్తు చేస్తోంది. కరోనా కారణంగా ప్రస్తుత జనవరి-మార్చి క్వార్టర్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మళ్లీ 2009 నాటి కనిష్ఠ స్థాయికి దిగజారవచ్చునని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఓఈసీడీ అంచనా వేసింది. 2020 ఏడాదికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాను 2.4 శాతానికి తగ్గించింది. అంతకుముందు దీనిని 2.9 శాతంగా అంచనా వేసింది.

తొలి వైరస్ కరోనా
కరోనా వైరస్ దీర్ఘకాలం ప్రభావం చూపితే గ్లోబల్ జీడీపీ వృద్ధి 1.5 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పరిస్థితి మరింత తీవ్రతరమైతే ప్రజల ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ఉద్దీపనల విషయంలో అగ్రరాజ్యాలు పరస్పర సహకారంతో విధానపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఓఈసీడీ పేర్కొంది. ప్రపంచీకరణ యుగంలో ఎక్కువ దేశాలకు విస్తరించిన తొలి వైరస్ కరోనా అని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది.

రూ.72 లక్షల కోట్ల గండి
కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. పర్యాటకం కుంటుపడుతోంది. సరుకు రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎయిర్ లైన్స్ నిలిచి ప్రయాణాలు ఆగిపోయాయి. పెట్టుబడిదారులు వేచిచూస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోతున్నాయి. వీటి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లకు పైగా (రూ.72 లక్షల కోట్లకు పైమాటే) గండి పడవచ్చునని ఆక్స్‌ఫర్డ్ అంచనా.

పడకేసిన పారిశ్రామికోత్పత్తి
చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా తగ్గింది. ప్రపంచంలో చైనా జీడీపీ 16 శాతం వరకు ఉంది. వివిధ దేశాలకు ఎన్నో వస్తువులు ఉత్పత్తి అవుతాయి. గత నెలకు చైనా తయారీ రంగ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 40.3కు పతనమైంది. 2004లో ఈ సర్వే సూచీ గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే కనిష్ఠం. జనవరిలో పీఎంఐ సూచీ 51.1గా నమోదయింది. పారిశ్రామికోత్పత్తి ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది.

మనదేశంలో ఎన్నో రంగాల మీద ప్రభావం
కరోనా ప్రభావం భారత్‌లో వ్యవసాయ ఎగుమతులు, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాలు భారీగా దెబ్బతున్నాయి. భారత తయారీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతినింది. భారత జీడీపీలో సేవారంగం తర్వాత తయారీ రంగానిదే అగ్రభాగం. మన ఉత్పాదక రంగానికి మూలవనరు చైనా. కీలక రంగాలకు చైనా నుండి ముడి సరుకు వస్తోంది. అక్కడి కర్మాగారాలు మూతబడటంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత తయారీ రంగం మందగించింది. భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం 0.2 శాతం మేర ఉండవచ్చునని ప్రాథమిక అంచనా.

ఎయిర్ లైన్స్ ఇబ్బందులు...
కరోనా వ్యాప్తితో పర్యాటక రంగం వెలవెలబోతోంది. చైనా సహా వివిధ దేశాలు ఎయిర్ లైన్స్‌ను రద్దు చేశాయి. గత పుష్కర కాలంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులును ఎయిర్ లైన్స్ రంగం ఎదుర్కొంటోంది. కరోనా నష్టాన్ని సాధ్యమైనంతమేర తగ్గించుకునేందుకు ఎమిరేట్స్, లుఫ్తాన్సా, సింగపూర్ ఎయిర్ లైన్స్ వంటి వివిధ సంస్థలు చర్యలు చేపట్టాయి.

వేతనాల్లో కోత.. సిబ్బంది తొలగింత
విమానయాన సంస్థలు ఉన్నత ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడం, సిబ్బందిని తగ్గించుకోవడం లేదా వేతనంలేని సెలవులకు పంపించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. మరిన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు పార్ట్ టైమ్ వర్క్ ఆఫర్ చేస్తున్నాయి. ఖర్చులను కుదించుకున్నాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి.


Click it and Unblock the Notifications