కరోనా దెబ్బ: రూ.10 లక్షలకోట్ల సంపద ఆవిరి, ప్రపంచ మార్కెట్లో అతి పెద్ద పతనం
చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ ఏడాదిలో భారత మార్కెట్లు దాదాపు వెయ్యి పాయింట్లు లేదా వెయ్యికి పైగా నష్టపోయిన సందర్భాలు మూడు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సెన్సెక్స్ దాదాపు 1,000 దిగజారింది. కరోనా వైరస్ భయంతో ఇటీవల 900 పాయింట్ల వరకు, ఇప్పుడు ఏకంగా 1,150 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీది అదే దారి.

వరుసగా ఆరు సెషన్లలో నష్టాలు
కరోనా వైరస్ భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో సురక్షిత బంగారం వంటి అతి విలువైన లోహాలపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గత వారం రోజులుగా సెన్సెక్స్ 42,000 మార్క్ నుండి 38,000 మార్క్‌కు దిగజారింది. వరుసగా ఆరు సెషన్లలో మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఆరు వరుస సెషన్లలో భారత మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎంత నష్టపోయారో తెలుసా.. ఏకంగా రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరయింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత శుక్రవారం రూ.158.71 లక్షల కోట్లు కాగా, నేడు (శుక్రవారం 28, ఫిబ్రవరి) ఉదయానికి రూ.148.53 లక్షల కోట్లకు దిగజారింది. అంటే రూ.10 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది.

2011 తర్వాత ప్రపంచ మార్కెట్లో అతిపెద్ద ఒకరోజు పతనం
కరోనా వైరస్ భయాలతో ప్రపంచమార్కెట్లు పాతాళానికి పడిపోతున్నాయి. ఎస్ అండ్ పీ 500 ఒక్కరోజులోనే ఏకంగా 4.4 శాతం మేర పడిపోయింది. 2011 తర్వాత ఇంతలా దిగజారడం ఇదే మొదటిసారి.

2008 అక్టోబర్ తర్వాత..
డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ దాదాపు 1200 పాయింట్లు దిగజారింది. ఎస్ అండ్ పీ 500 వారం రోజుల్లో 12 శాతం దిగజారి ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. 2008 అక్టోబర్ ఆర్థికమాంద్యం సమయంలో మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారత్, అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతిన్నాయి.


Click it and Unblock the Notifications