COVID 19 దెబ్బ: నిలిచిన విమానాలు, 29 లక్షల ఉద్యోగాలు ఊడిపోవచ్చు
కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ ప్రభావం పడింది విమానయానం, ఆతిథ్య రంగాలపై పడింది. ఈ రంగాల్లో 29 లక్షలకు పైగా ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్సుపోర్ట్ అసోసియేషన్ (IATA) అంచనా వేస్తోంది. విమాన రంగంలోని ఒక్కో ఉద్యోగం ట్రావెల్, టూరిజం రంగాల్లో 24 మంది ఉపాధికి మద్దతిస్తుంది.

రూ.85,000 కోట్ల నష్టం
లాక్ డౌన్ కారణంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ అన్నీ నిలిచిపోయాయి. దీంతో ఎయిర్ లైన్స్ ఆదాయానికి రూ.11,221 కోట్ల డాలర్లు లేదా రూ.85,000 కోట్లకు పైగా గండి పడవచ్చునని IATA చెబుతోంది. దీంతో ఈ ఏడాది భారత విమాన ప్రయాణీకుల రద్దీ 47 శాతం తగ్గవచ్చునని చెబుతోంది. లాక్ డౌన్ కారణంగా విమానయానం, పర్యాటక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపింది. భారత్‌లో లాక్ డౌన్‌కు ముందే అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయాయి.

విమాయానం, దానిపై ఆధారపడిన రంగాలు
మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ నేపథ్యంలో విమానయానం, దానిపై ఆధారపడిన పరిశ్రమల్లో 29 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చునని తెలిపింది. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో కరోనా వల్ల భారత్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, దేశీయ విమాన పరిశ్రమ, దానిపై ఆధారపడిన 29,32,900 వరకు ఉద్యోగాలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చునని తెలిపింది.

ఎక్కడ ఎంత ఆదాయం తగ్గవచ్చునంటే
2019తో పోలిస్తే ప్రయాణీకుల రద్దీ బాగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల ఆదాయాలు ఈ ఏడాది 314 బిలియన్ డాలర్ల మేర తగ్గవచ్చునని అంచనా వేసింది. 2019తో పోలిస్తే ఇది 55 శాతం తక్కువ. అంతర్జాతీయంగా ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 113 బిలియన్ డాలర్ల మేర ఆదాయంలో క్షీణత ఉండవచ్చు.


Click it and Unblock the Notifications