Copper: బంగారం, వెండి కాదు.. ఇప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్ 'రాగి'! ఎందుకో తెలుసా?
సాధారణంగా మనం పెట్టుబడి అనగానే బంగారం లేదా వెండి గురించి ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ప్రపంచ వస్తువుల మార్కెట్(Commodity Market)లో ఒక 'ఎర్రటి లోహం' సంచలనం సృష్టిస్తోంది. అదే రాగి (Copper). ఇటీవలి కాలంలో రాగి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు షాక్‌కు గురవుతున్నారు. ఒకప్పుడు కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితమైన రాగి.. ఇప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.

రికార్డు స్థాయికి రాగి ధరలు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'గోల్డ్‌మన్ సాచ్స్' నివేదిక ప్రకారం, డిసెంబర్ 2025 ప్రారంభంలో రాగి ధరలు టన్నుకు 11,771 డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. ఈ ఏడాదిలోనే రాగి ధరలు ఏకంగా 35% పైగా పెరగడం విశేషం. 2009 తర్వాత రాగికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
రాగి ధరలు పెరగడం వెనుక కేవలం డిమాండ్ మాత్రమే కాదు.. ఆధునిక సాంకేతిక విప్లవం కూడా ఉంది..
1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): ఏఐ యుగంలో డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాల కల్పనకు విద్యుత్ సరఫరా చాలా కీలకం. వీటికి కావలసిన వైరింగ్, పవర్ గ్రిడ్లలో రాగిని విరివిగా వాడుతున్నారు.
2. ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) & గ్రీన్ ఎనర్జీ: సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో రాగికి ప్రత్యామ్నాయం లేదు. దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ రాగికి భారీ డిమాండ్ తెచ్చిపెట్టింది.
3. తక్కువ సరఫరా - ఎక్కువ డిమాండ్: ఇండోనేషియా వంటి దేశాల్లో మైనింగ్ కు అంతరాయాలు ఏర్పడడం అలాగే పెద్ద కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల మార్కెట్‌లో రాగి కొరత (Deficit) ఏర్పడింది. 2026 నాటికి ఈ కొరత 1,50,000 టన్నులకు చేరవచ్చని అంచనా.
గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు: 2026లో ఏం జరగనుంది?
రాగి భవిష్యత్తుపై గోల్డ్‌మన్ సాచ్స్ ఆసక్తికరమైన అంచనాలను వేసింది..
- స్వల్పకాలిక తగ్గుదల: 2026లో రాగి ధరలు టన్నుకు 11,000 డాలర్ల కంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది. దీనికి కారణం మార్కెట్‌లో తాత్కాలికంగా సరఫరా మిగులు ఉండటం.
- దీర్ఘకాలిక వృద్ధి: ఏఐ, డిఫెన్స్, పవర్ గ్రిడ్ల ఆధునికీకరణ వల్ల రాగి ధరలు మళ్ళీ పుంజుకుంటాయని నివేదిక పేర్కొంది.
రాగిపై ఇన్వెస్టర్ల క్రేజ్
రాగికి ఉన్న డిమాండ్‌ను చూసి ఇన్వెస్టర్లు ఇప్పుడు Copper ETFs (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) వైపు మొగ్గు చూపుతున్నారు. కెనడాకు చెందిన స్ప్రాట్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రపంచంలోనే మొదటి ఫిజికల్ కాపర్ ఫండ్‌ను ప్రారంభించగా.. అది ఈ ఏడాది 46% లాభాలను ఆర్జించింది.
ఫ్యూచర్ మెటల్ ఇదే..
చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, అమెరికాలో పెరిగిన నిల్వలు అలాగే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ నెట్‌వర్క్ ల ఆధునికీకరణ వంటివి రాగిని 'ఫ్యూచర్ మెటల్' గా మార్చేశాయి. ఈ కారణాల వల్ల బంగారం, వెండి తర్వాత ఇప్పుడు రాగి కూడా ఒక విలువైన ఆస్తిగా మారుతోంది.


Click it and Unblock the Notifications