కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ పైన కనిపిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. సెకండ్ వేవ్ ప్రభావం కూడా కనిపించినప్పటికీ ఫస్ట్ వేవ్ అంతగా లేదు. ఇప్పుడు ఒమిక్రాన్ ప్రభావం మొదటి రెండింటి అంతగా లేనప్పటికీ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మాత్రం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నాయి. తాజాగా సిటీ గ్రూప్ ఇంక్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రయివేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు ఆర్థిక నిపుణులు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించారు. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ జీడీపీ వృద్ధి మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. గతంలో 9.5 శాతంగా వేశారు.

ఒమిక్రాన్ ప్రభావం తక్కువే
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కంటే ఒమిక్రాన్ ప్రభావం ప్రస్తుత త్రైమాసికంపై తక్కువగానే ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే కార్యకలాపాలు గత మూడు నెలలుగా క్రమంగా మందగిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా జీడీపీ అంచనాలను సవరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 80 బేసిస్ పాయింట్లు తగ్గి 9 శాతానికి చేరుకోవచ్చునని సిటీ ఆర్థిక నిపుణులు సమిరన్ చక్రవర్తీ, బఖార్ ఎం జైదీ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 8.3 శాతం, 8.7 శాతంగా ఉండవచ్చునని అంచనా వేశారు.

వృద్ధి రేటు అంచనాలు ఇలా
ఇండియా జీడీపీ వృద్ధి రేటును గతంలో సిటీ బ్యాంకు 9.8 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు 9 శాతానికి సవరించింది. ఇండియా రేటింగ్స్ గతంలో 9.4 శాతంగా అంచనా వేయగా, ప్రస్తుతం 9.3 శాతానికి సవరించింది. ఐసీఐసీఐ బ్యాంకు గతంలో వడ్డీ రేటును 9.8 శాతంగా అంచనా వేయగా, ప్రస్తుతం 9.6 శాతానికి సవరించింది.

ఒమిక్రాన్ ఉన్నప్పటికీ...
సౌత్ ఏషియన్ దేశమైన భారత్‌లో కరోనా కేసులు రెండు వారాల క్రితం 6500గా ఉండగా, ప్రస్తుతం 17000కు చేరుకున్నాయి. ఇటీవల ఒమిక్రాన్ వ్యాప్తి వేగవంతమైనట్లుగా కనిపిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాలు ఆర్థిక రికవరీకి దోహదపడతాయని భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్ కూడా మున్ముందు దూసుకెళ్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం.


Click it and Unblock the Notifications