ఒకప్పుడు స్థానికంగా నడిచే చిన్న బ్యాంకులు మన కళ్లముందే కనిపించేవి. కానీ ఇప్పటి రోజుల్లో పరిస్థితి మారిపోయింది. చిన్న బ్యాంకుల సంఖ్య వేగంగా తగ్గిపోయింది. 2000 నుండి 2014 మధ్య, 3,000 కంటే ఎక్కువ చిన్న బ్యాంకులు అమెరికాలో మూతపడ్డాయి. అదే సమయంలో పెద్ద బ్యాంకులు తమ ఆస్తులను మరింతగా పెంచుకున్నాయి.ఈ పరిస్థితిని బాగా వివరించే గణాంకాలను S&P Global పత్రిక తాజా ర్యాంకింగ్స్‌లో వెల్లడించింది. ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద బ్యాంకుల జాబితాలో నాలుగు చైనా బ్యాంకులు అగ్రస్థానాల్లో ఉండడం గమనార్హం.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదగడమే కాకుండా.. ప్రపంచ బ్యాంకింగ్ రంగంపై కూడా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. బ్యాంకుల ఆస్తుల పరంగా రూపొందించిన తాజా గ్లోబల్ టాప్ 10 జాబితాలో Chinese banks మొదటి నాలుగు స్థానాలను ఆక్రమించాయి.అదే సమయంలో భారత బ్యాంకులు టాప్ టెన్ లో ఒకటి కూడా చోటు దక్కించుకోలేకపోయాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం,ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC) అగ్రస్థానంలో ఉంది. దీని మొత్తం ఆస్తుల విలువ 6.7 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన బ్యాంక్‌గా నిలిచింది.

రెండవ స్థానంలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా, మూడవ స్థానంలో చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, నాలుగవ స్థానంలో బ్యాంక్ ఆఫ్ చైనా ఉన్నాయి. ఈ నాలుగు బ్యాంకుల కలిపిన మొత్తం ఆస్తులు దాదాపు 23 ట్రిలియన్ డాలర్లు.. ఇది చైనా GDP కంటే చాలా ఎక్కువగా ఉంది.
ఇవే కాకుండా జెపి మోర్గాన్ ఛేస్ (JP Morgan Chase) 4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో ఐదవ స్థానంలో ఉండగా.. బ్యాంక్ ఆఫ్ అమెరికా 3.3 ట్రిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉంది. బ్రిటన్‌కు చెందిన HSBC 3 ట్రిలియన్ డాలర్లతో ఏడవ స్థానంలో ఉండగా, ఫ్రాన్స్‌కు చెందిన BNP పారిబాస్ 2.8 ట్రిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. క్రెడిట్ అగ్రికోల్ 2.7 ట్రిలియన్ డాలర్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచాయి. జపాన్‌కు చెందిన మిత్సుబిషి UFJ ఫైనాన్షియల్ గ్రూప్ 2.6 ట్రిలియన్ డాలర్లతో పదవ స్థానాన్ని ఆక్రమించింది.
అయితే భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు చెందిన బ్యాంకులు ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోలేదు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI ఆస్తులు 547 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇక ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC బ్యాంక్ 494 బిలియన్ల డాలర్ల ఆస్తులతో ఉంది. ఇవి టాప్ 100లో స్థానం సంపాదించాయి అయితే టాప్ 10కి మాత్రం చాలా దూరంగా ఉన్నాయి.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. భారత బ్యాంకులు ఇప్పటికీ ప్రధానంగా రెటైల్ బ్యాంకింగ్, దేశీయ సేవలపైనే ఆధారపడుతున్నాయి. చైనా బ్యాంకులు మాత్రం గ్లోబల్ లెండింగ్, మాస్ కాపిటల్ హోల్డింగ్స్, ప్రభుత్వ మద్దతుతో పెద్ద ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతూ, భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నాయి. ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే.. భారత బ్యాంకింగ్ రంగం అభివృద్ధికి ఇంకా చాలా దూరం ఉన్నట్లు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, భారత బ్యాంకులు ప్రస్తుతం డిజిటల్ మార్పిడి, ఫిన్‌టెక్ విస్తరణ మరియు గ్లోబల్ ఇంటెగ్రేషన్‌కు దృష్టి పెడుతున్నాయి. ఇది వీటిని వచ్చే దశాబ్దాల్లో టాప్ గ్లోబల్ బ్యాంకుల జాబితాలో చేర్చే అవకాశాన్ని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications