ప్రపంచ దేశాల్లో అదుర్స్, అందుకే వేగంగా పుంజుకుంటోన్న చైనా
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అగ్రరాజ్యం అమెరికా సహా అన్ని దేశాల ఆర్థికస్థితి కకావికలమైంది. కరోనా పుట్టిన ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా మాత్రం రెండో క్వార్టర్ నుండే కాస్త పుంజుకోవడం ప్రారంభించింది. 2020 క్యాలెండర్ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ప్రతికూలత జీడీపీని నమోదు చేసిన చైనా, రెండో త్రైమాసికం నుండి పాజిటివ్‌లోకి వచ్చింది. మిగతా దేశాలు తేరుకోవడానికి ఎన్ని త్రైమాసికాలు పడుతుందో తెలియని పరిస్థితుల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు మాత్రం వేగంగా పుంజుకుంటోంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

కరోనా కట్టడి.. పుంజుకున్న కార్యకలాపాలు
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే దేశ జీడీపీలో 4.9 శాతం వృద్ధి నమోదయినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. కరోనాను మార్చి నెలలోనే కట్టడి చేసినట్లు డ్రాగన్ దేశం ప్రకటించింది. క్రమంగా ఫ్యాక్టరీలు, కార్యాలయాలు తెరుస్తూ వచ్చింది. మాస్కులతో పాటు ఇతర వైద్య సామాగ్రికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగాయి. రిటైల్ విక్రయాలు కూడా కరోనా ముందు దశకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రిటైల్ సేల్స్ ఒక శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు రెండు క్వార్టర్‌లలో ఇది 7.2 శాతం క్షీణించింది.

సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ సేల్స్
రిటైల్ సేల్స్ ఒక్క సెప్టెంబర్ నెలలోనే 3.3 శాతం మేర పెరిగాయి. దేశీయంగా వృద్ధి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేవని చైనా ప్రభుత్వం అభిప్రాయపడింది. కరోనా మళ్లీ విజృంభించకుండా చూడాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై కొనసాగుతోందని తెలిపింది. కఠిన కరోనా నిబంధనల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్లు పేర్కొంది.

ఆర్థికవేత్తల అంచనా కంటే దిగువకు
సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.9 శాతం నమోదయినప్పటికీ ఆర్థికవేత్తల అంచనా కంటే దిగువనే ఉంది. అదే సమయంలో రెండో త్రైమాసికం 3.2 శాతం వృద్ధి రేటు కంటే వేగంగా పుంజుకుంటోంది. పారిశ్రామిక నెలలో 6.9 శాతం పెరిగింది. గత తొమ్మిది నెలల కాలాన్ని పరిశీలిస్తే పెట్టుబడుల వృద్ధి 0.8 శాతం మేర ఉంది. ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఏడాదిలో మొదటి అర్థ సంవత్సరంలో దెబ్బతిన్నప్పటికీ మూడో క్వార్టర్‌లో మాత్రం కోలుకుంది.


Click it and Unblock the Notifications