China Support to India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద కక్షగట్టాడు. రష్యాతో ఇండియా చేసే చమురు వ్యాపారాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో భారత్ మీద సుంకాల దాడిని ప్రారంభించాడు. భారతదేశం సహా అనేక దేశాలపై 50 శాతం వరకు దిగుమతి సుంకాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పొరుగుదేశం చైనా భారత్ కు అండగా నిలిచింది. ఈ సుంకాల దాడిపై మండిపడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్‌కు తలవంచవద్దంటూ భారత్‌కు చైనా సలహా ఇచ్చింది.
చైనా రాయబారి ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ చేశారు. భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. బెదిరింపుదారునికి ఒక అంగుళం ఇస్తే, మైలు దూరం వెళ్తాడని మండిపడ్డారు. ట్రంప్ ను ప్రపంచ దేశాలను బెదిరింపులకు గురి చేస్తున్న దొంగగా అభివర్ణించారు.ఇదే పోస్టులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ముఖ్య సలహాదారు సెల్సో అమోరిమ్ మధ్య జరిగిన సమావేశంలోని ముఖ్యాంశాలను కూడా ఆయన పంచుకున్నారు.
ఇతర దేశాలను అణచివేయడానికి సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం UN చార్టర్‌కు విరుద్ధమన్నారు. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు.ఇది ప్రజాదరణ లేనిది, అస్థిరమైనదిగా పేర్కొన్నారు. దీని ప్రభావం ప్రజల మద్దతును కోల్పోయే విధంగా ఉంటుందన్నారు.

ట్రంప్ ప్రభుత్వం మొదట భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించినప్పటికీ.. వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రాబల్యం, అలాగే రష్యా చమురు కొనుగోళ్లపై వివాదాల మధ్య చర్చలు ముందుకు వెళ్లలేదు. ఐదు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో భారతదేశంపై 50 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించడంపై దృష్టి పెట్టారు.
ట్రంప్ వాణిజ్య విధానాలపై చైనా ఇప్పటికే తన అభిప్రాయాన్ని పలు మార్లు స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా చైనా దిగుమతులపై సుంకాలను 145 శాతం వరకు పెంచగా, చైనా మాత్రం 125 శాతం సుంకాలు మాత్రమే విధించింది. ఈ నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ లెక్కలు చూస్తే మీరు నవ్వులు పాలవుతారని ట్రంప్ ను ఉద్దేశించి మండిపడ్డారు. కాగా ఈ ఏడాది మొదట్లో చైనా- అమెరికాల మధ్య సుంకాల యుద్ధం ప్రారంభమైంది.
అయితే ట్రంప్ మాత్రం తన ధోరణిని ఇప్పటికీ మార్చుకోలేదు. ఇటీవల వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేము భారతదేశంతో ఇప్పటికే చేయగలిగాము..ఇక చైనాతో కూడా త్వరలో సుంకాల ప్రకటన చేస్తామంటూ తెలిపారు. శుక్రవారం నాటికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే రష్యా చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై రెండవ దశ సుంకాలు విధించవచ్చని హెచ్చరించారు. భారతదేశం, చైనా, టర్కీ ఈ జాబితాలో ముఖ్య దేశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా BRICS దేశాల మధ్య ఐక్యత పెరుగుతోంది. చైనా, బ్రెజిల్ ఇప్పటికే కలిసి వ్యూహాత్మక చర్చలు ప్రారంభించాయి. దీనికి భారతదేశం కూడా మద్దతు ఇవ్వవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది చివర్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ట్రంప్ సమావేశం కావాలనే ప్రయత్నం జరుగుతున్నా.. ఈ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఆ సమావేశం ఎంతవరకు జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications