అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్-చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరోసారి బహిరంగంగా వెలుగులోకి వచ్చాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు, అలాగే సోలార్ రంగానికి అందిస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది భారత్‌పై చైనా WTOలో ఫిర్యాదు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఫిర్యాదుతో ఆసియాలోని రెండూ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య విభేదాలు మరింత ముదిరినట్లుగా కనిపిస్తున్నాయి.
చైనా ఆరోపణలు ఏమిటి?: చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భారత్ అమలు చేస్తున్న కొన్ని విధానాలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని బీజింగ్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నేషనల్ ట్రీట్‌మెంట్ సూత్రాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని చైనా వాదిస్తోంది. అంటే దేశీయ ఉత్పత్తులకు అనుకూలంగా, విదేశీ ఉత్పత్తులపై వివక్ష చూపే విధానాలు భారత్ అనుసరిస్తోందని దీని అర్థం.

అదే విధంగా.. దిగుమతి ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించే రాయితీలు WTO నియమాల ప్రకారం నిషేధించబడ్డవని చైనా పేర్కొంది. సోలార్ ప్యానెల్స్, మాడ్యూళ్లు వంటి రంగాల్లో భారత కంపెనీలకు సబ్సిడీలు ఇచ్చి, విదేశీ కంపెనీలకు పోటీ అవకాశాలను తగ్గిస్తోందని వాదించింది. ఈ విధానాలు చైనా కంపెనీల వ్యాపార ప్రయోజనాలను నష్టపరుస్తున్నాయని, భారత తయారీదారులకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కలుగుతోందని స్పష్టం చేసింది. అందుకే ఈ రాయితీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా WTO నిబంధనలకు అనుగుణంగా సవరించాలని భారత్‌ను కోరింది.
భారత్ వైఖరి ఏమిటి?: ఈ అంశంపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, పరిణామాలపై అవగాహన ఉన్న అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఇలాంటి ఫిర్యాదులు అంతర్జాతీయ వాణిజ్యంలో సాధారణమేనని వారు అభిప్రాయపడుతున్నారు. దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడం, స్వయం సమృద్ధి లక్ష్యాన్ని సాధించడం కోసం కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహకాలు అవసరమని భారత్ భావిస్తోంది.
పునరుత్పాదక ఇంధనం, ఐటీ హార్డ్‌వేర్, హైటెక్ తయారీ వంటి రంగాల్లో భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (PLI) తయారీ సామర్థ్యాన్ని పెంచడానికేనని నిపుణులు చెబుతున్నారు. ఇవి పూర్తిగా WTO నిబంధనల పరిధిలోనే ఉన్నాయని భారత్ తరఫు వాదనగా తెలుస్తోంది. అయితే ఇది కొత్త వివాదమేమి కాదు. గత అక్టోబర్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు (EV), బ్యాటరీ తయారీ రంగాల్లో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై చైనా WTOలో ఫిర్యాదు చేసింది. గ్రీన్ ఎనర్జీ, క్లీన్టెక్, హైటెక్ తయారీ రంగాల్లో ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ నేపథ్యంలోనే ఈ చర్యలను చైనా చేపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం WTO ప్రక్రియ ప్రకారం.. ముందుగా భారత్-చైనా మధ్య సంప్రదింపులు జరగాలి. ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే.. WTO వివాద పరిష్కార కమిటీ ఈ అంశాన్ని విచారిస్తుంది. ఈ వివాదం ఫలితం భవిష్యత్తులో భారత్ అమలు చేసే పారిశ్రామిక విధానాలు, గ్రీన్ ఎనర్జీ వ్యూహాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications