Telangana: యువతకు శుభవార్త.. టెక్స్‌టైల్ పార్క్‌తో మూడు లక్షల కొలువులు..
Telangana: కొన్నాళ్లుగా ఐటీ రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ.. ప్రస్తుతం పారిశ్రామిక వర్గాలకు మెుదటి ఎంపికగా మారిపోయింది. అపారమైన పెట్టుబడి అవకాశాలను అభివృద్ధికి దోహదపడేందుకు, కొత్త ఉపాధి అవకాశాలతో చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చి తమ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి.
పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అండ్ అపెరల్ పార్క్ ద్వారా తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఒకదానిని నెలకొల్పుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిద్వారా వస్త్ర పరిశ్రమకు మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

కేంద్రం దీనిని నెలకొల్పటానికి దాదాపు రూ.4,400 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ టెక్స్‌టైల్ పార్కుకు రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయన్నారు. వివిధ దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు చేసే అవకాశం ఉందన్నారు. ఈ పార్క్ ద్వారా తెలంగాణ ప్రజలకు లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు.. 2 లక్షల వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
మోదీ సర్కార్ జాతీయ రహదారులు, రైల్వేలు, జౌళి, వ్యవసాయం, ఉపాధి కల్పన, పెట్టుబడులు, ఐటీ తదితర అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ పార్కులు తెలంగాణతో పాటు తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఏర్పాటు కానున్నాయని జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ పార్కుల ఏర్పాటు ద్వారా భారతదేశాన్ని వస్త్ర తయారీ, ఎగుమతుల్లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలని కేంద్రం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కుల ద్వారా దాదాపు రూ.70,000 కోట్ల పెట్టుబడులతో పాటు దేశవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగులు వస్తాయని కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications