Edible Oil Rates: దేశంలో గత సంవత్సరం దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచి వంట నూనెల ధరలు వరుసగా పెరగటం ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం వాటి ధరలు కొంత తగ్గినప్పటికీ.. సామాన్యులకు ఇంకా అందుబాటు ధరల్లోకి మాత్రం రాలేదు. అయితే ధరలు ఇంకా పెరగకుండా ఉండేందుకు మాత్రం కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది.

మరో 6 నెలలు..
దేశంలో వంటనూనె ధరలను స్థిరంగా ఉంచేందుకు ఇప్పటికే దిగుమతులపై రాయితీని కేంద్రం అమలు చేస్తోంది. తాజాగా పండుగల వేళ ఈ రాయితీని మరో ఆరు నెలలు అంటే మార్చి 31, 2023 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డెరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దేశీయంగా సరఫరాను పెంచడంతోపాటు ధరలను అదుపులో ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తగ్గిన నూనెల ధరలు..
ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై రాయితీ కస్టమ్స్ సుంకం తగ్గింపు గడువు 2023 మార్చి వరకు పెంచటం వల్ల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ధరల పతనం అవుతున్నందున నూనెల ధరలు భారీగా తగ్గుతున్నాయి. సరఫరా వ్యవస్థలు మెరుగుపడటం, అంతర్జాతీయంగా ధరలు తగ్గుదల, కొన్ని దేశాల్లో ఉత్పత్తి పెరగటం, దేశంలోకి దిగుమతి సుంకం తగ్గుదల వంటి అనేక కారణాల వల్ల మన దేశంలో కుక్కింగ్ ఆయిల్స్ రిటైల్ ధరలు గణనీయంగా తగ్గాయి.

పన్నుల విధానంలో మార్పు ఉండదు..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా.. మార్చి 31, 2023 వరకు క్రూడ్ పామ్ ఆయిల్, ఆర్‌బిడి పామోలిన్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, రిఫైండ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లపై ప్రస్తుత డ్యూటీ విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం వీటిపై దిగుమతి సుంకం సున్నా రూపాయలుగా ఉంది. అయితే 5% వ్యవసాయ, 10% సామాజిక సంక్షేమ సెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ముడి ఆయిల్స్ పై సుంకం 5.5 శాతానికి చేరుకుంటుంది.

రిఫైండ్ పామాయిల్ విషయంలో..
రిఫైండ్ పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం కాగా, సాంఘిక సంక్షేమ సెస్ 10 శాతంగా ఉంది. కాబట్టి ప్రభావవంతమైన ఛార్జ్ 13.75 శాతంగా ఉందని మనం గమనించాలి. రిఫైండ్ సోయాబీన్, రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 17.5 శాతం ఉండగా.. 10 శాతం సామాజిక సంక్షేమ సెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే అది 19.25 శాతానికి చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications