States Debt: కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. దీనిని ఎదుర్కొని నిలబడేందుకు ఆయా దేశాలు రుణాల బాట పట్టాల్సి వచ్చింది. మన దేశంలోని పలు రాష్ట్రాలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల రుణభారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఓ ప్రకటన చేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల స్థూల రుణాలు రికార్డు స్థాయికి చేరినట్లు ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ తెలిపారు. లోక్ సభలో MP నామా నాగేశ్వరరావు అడిగిన ఓ ప్రశ్నకు అధికారిక గణాంకాల ఆధారంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు ఆర్థిక నిర్వహణలో మెరుగ్గా పనిచేస్తుండగా.. మరికొన్ని మాత్రం విఫలమవుతున్నట్లు వెల్లడించారు.

2023 బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ అప్పులు 3.66 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్ నుంచి TSCSCL రుణ భారం అధికంగా 15.64 వేల కోట్లుగా ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 6.5 వేల కోట్లు, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమని 4.2 వేల కోట్లు అప్పులు చేసినట్లు తెలిపారు.
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మార్చి 2023 నాటికి AP రుణభారం 4.42 లక్షల కోట్లుగా ఉన్నట్లు లోక్ సభలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలోనే తమిళనాడు అత్యధికంగా 7.53 లక్షల కోట్లు రుణాలు సేకరించినట్లు తెలిపారు. అయితే గత మూడేళ్లలో అప్పులు తగ్గించుకున్న ఏకైక రాష్ట్రంగా ఒడిశా నిలిచినట్లు ప్రకటించారు. మరే ఇతర రాష్ట్రం ఈ ఘనతను సాధించలేదని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications