ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్, క్యాష్ లెస్ పేమెంట్స్. భవిష్యత్తులో వీటి వాటా మరింత పెరగనుందని ఇప్పటికే నివేదికలు వెలువడ్డాయి. UPI వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది నిజమేనని ఒప్పుకోక తప్పని పరిస్థితి. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి చెల్లింపులు చేసే స్థితి నుంచి, సెకన్లలో ఒక్క క్లిక్ తో పూర్తిచేసే అవకాశానికి కారణం ఈ నగదు రహిత లావాదేవీలే.

నగదు vs క్యాష్ లెస్:
దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నందున త్వరలో డిజిటల్ లావాదేవీలు సింహభాగాన్ని ఆక్రమిస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. నగదు చెల్లింపులను సైతం అధిగమిస్తాయన్నారు. సింగపూర్ తో UPI మరియు PayNow మధ్య క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ ప్రారంభం సమావేశంలో ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదేశ ప్రధానితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంతాగా వాడేస్తున్నారా..?
ఒక్క 2022లోనే రూ.126 ట్రిలియన్ల విలువైన 74 బిలియన్ల లావాదేవీలు UPI ద్వారా జరిగినట్లు ప్రధాని స్పష్టం చేశారు. వీటి విలువ దాదాపు 2 ట్రిలియన్ల సింగపూర్ డాలర్లకు సమానమన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుగుతున్నాయంటే, దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని ప్రజలు విశ్వసిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మరియు మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ఈ సమావేశంలో మొదటి లావాదేవీని పూర్తిచేశారు.

ప్రవాసులకు ప్రయెజనకరంగా..
భారత UPI, సింగపూర్ PayNow అనే ఈ రెండు చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకూ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సరిహద్దులతో సంబంధం లేకుండా చెల్లింపులను వేగంగా, తక్కువ ఖర్చుతో బదిలీ చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుందంటున్నారు. సింగపూర్ లోని ప్రవాస భారతీయులకు ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులకు మరింత మేలు చేస్తుందని ఆశిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు UPI సేవలను విస్తరించాలని కేంద్రం స్థిర నిశ్చయంతో ఉంది.


Click it and Unblock the Notifications