భారీగా తగ్గి, మళ్లీ జంప్ చేస్తోంది: బంగారం ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేయవచ్చా?
బంగారం ధరలు మార్చి నెలలో మూడు శాతం క్షీణించాయి. ఆర్థిక రికవరీ ఆశలతో యూఎస్ ట్రెజరీ యీల్డ్స్, డాలర్ బలపడిన నేపథ్యంలో గత కొంతకాలంగా పసిడిపై ఒత్తిడి తగ్గుతోంది. డాలర్, ట్రెజరీ యీల్డ్స్ పైన ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలూ ప్రభావం చూపాయి. అంతేకాదు, బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల వైపు ఇన్వెస్టర్ల చూపు పడింది. దీంతో పసిడి ధరలు అంతగా పెరగకపోవడం లేదా స్థిరంగా ఉండటం కొనసాగుతోంది. అమెరికా 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటన, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకు వ్యాఖ్యలు, కరోనా కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపాయి.

వేగవంత రికవరీ.. ఆశల్లేని ఇన్వెస్టర్లు
వేగవంతమైన ఆర్థిక రికవరీ ఆశలతో యూఎస్ 10 ఇయర్ యీల్డ్స్ 1.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అమెరికా పేరోల్ డేటా సానుకూలంగా ఉంది. ఫెడ్ నిర్ణయాలు మార్కెట్‌కు అనుకూలంగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం పాజిటివ్ అంచనాలతో ఉంది. క్రిప్టోకరెన్సీ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఈ అంశాలు బంగారం దూకుడును తగ్గించాయని భావిస్తున్నారు. అమెరికాతో పాటు చైనా, భారత్ సహా ప్రపంచ దేశాల ఆర్థిక రికవరీ వేగవంతంగా ఉంది.
వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైంది. అమెరికాలో 60 రోజల్లోనే 100 మిలియన్ల డోసుల టార్గెట్ పూర్తి అయింది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద నిల్వలు మార్చి చివరి నాటికి 5 శాతం క్షీణించాయి. ఇన్వెస్టర్లు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ పైన అంత ఆశాజనకంగా లేరనేందుకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు. మార్చి నెలలో ఎస్పీడీఆర్ నుండి నెల ప్రాతిపదికన 56 టన్నులు వెనక్కి వెళ్లింది.

రెండు సెషన్లలో రూ.వెయ్యి జంప్
మరోవైపు భారత అధికారిక బంగారం దిగుమతులు ఫిబ్రవరి నెల నాటికి 21 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 103 శాతం కాగా, నెల ప్రాతిపదికన 36.5 శాతం వృద్ధి సాధించింది. ఫిజికల్ మార్కెట్లో డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. అయితే కరోనా కేసులు తిరిగి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోలుకు మొగ్గు చూపవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే పసిడి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11400 తక్కువగా ఉంది. ఓ సమయంలో రూ.12వేలకు పైగా తగ్గింది. అయితే ఈ రెండు మూడు సెషన్లలో రూ.1000 వరకు పెరిగింది.

నిన్న ఎంత పెరిగిందంటే
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్ నిన్న రూ.228.00 (0.51%) పెరిగి రూ.44865.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,226.00 (1.92%) పెరిగి రూ.65040.00 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ 14.85 (+0.87%) పెరిగి 1,730.45 డాలర్ల వద్ద, వెండి 0.498 (+2.03%) డాలర్లు ఎగిసి 25.030 డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications