Indian wedding: భారత్‌లో వివాహ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏటా వేలు కాదు ఏకంగా లక్షల కోట్లమేర వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు మొదలైన పెళ్లిళ్ల సీజన్ లోనూ ఇదే రిపీట్ అవుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 42 లక్షల వివాహాలు జరగనున్నట్లు వ్యాపారుల సంఘం CAIT సర్వే తెలిపింది. జూలై మధ్య వరకు ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. ఈ మేరకు CAIT పరిశోధన విభాగం రీసెర్చ్ & ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ వివరాలను వెల్లడించింది.

ఒక్క ఢిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని CAIT జాతీయ అధ్యక్షులు BC భారతియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ భావిస్తున్నారు. వీటి ద్వారా దాదాపు 1.5 లక్షల కోట్ల వ్యాపార ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. గతేడాది డిసెంబర్ 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరగ్గా, వాటి ఖర్చు 4.25 లక్షల కోట్లకు పైమాటేనన్నారు.
వ్యాపారుల సంఘం గణాంకాల ప్రకారం.. సీజన్‌లో ఒక్కో పెళ్లికి 3 లక్షలు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. దాదాపు 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కోదానికి 6 లక్షలు, మరో 10 లక్షల వివాహాలకు 10 లక్షలు, ఆ తర్వాత 10 లక్షలకు దాదాపు 15 లక్షల చొప్పున ఖర్చు ఉంటుందని అంచనా. వీటికి అదనంగా మరో 6 లక్షల వివాహాలకు 25 లక్షలు, 60 వేల పెళ్లిళ్లకు 50 లక్షలు, 40 వేల వివాహాలకు కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.
వీటన్నిటిలోనూ ఇంటి మరమ్మతులు, పెయింటింగ్, ఆభరణాలు, చీరలు, ఫర్నిచర్, రెడీమేడ్ వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, శుభలేఖలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా సామాగ్రి, కిరాణా, ఆహార ధాన్యాలు, అలంకరణ వస్తువులు, ఎలక్ట్రికల్ యుటిలిటీస్, ఎలక్ట్రానిక్స్ మొదలైనవి అధిక డిమాండ్‌లో ఉన్నట్లు CAIT తెలిపింది. ఈ సంవత్సరం గణనీయమైన వ్యాపారాన్ని సృష్టించగలవని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications