Budget 2026: ధనవంతులపై పన్నుల భారం పెరగనుందా? నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు?
కేంద్ర బడ్జెట్ సమయం దగ్గరపడుతుండటంతో ఇన్‌కమ్ ట్యాక్స్, ఇతర పన్నుల మార్పులపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా ధనవంతులపై అదనపు సర్చార్జ్ లేదా వెల్త్ టాక్స్ (సంపద పన్ను) విధించాలనే ప్రతిపాదనలపై ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సంపన్నులపై అదనపు పన్నులు విధించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనను పన్ను నిపుణులు తప్పుబడుతున్నారు. ఆదాయపు పన్ను సర్ఛార్జ్‌ను పెంచడం లేదా గతంలో రద్దు చేసిన 'వెల్త్ టాక్స్'ను మళ్ళీ తీసుకురావడం వల్ల పెట్టుబడులు దేశం దాటి వెళ్లిపోయే (Capital Flight) ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం సర్ చార్జ్ ఎలా ఉందంటే?
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ. 50 లక్షల కంటే ఎక్కువ సంపాదన ఉన్నవారు ప్రాథమిక పన్నుతో పాటు అదనంగా 'సర్‌చార్జ్' చెల్లించాల్సి ఉంటుంది.
- రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు: 10 శాతం సర్‌చార్జ్.
- రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు: 15 శాతం సర్‌చార్జ్.
- రూ. 2 కోట్లు నుండి రూ. 5 కోట్ల వరకు: 25 శాతం సర్‌చార్జ్.
- రూ. 5 కోట్లు దాటితే: కొత్త పన్ను విధానంలో 25 శాతం, పాత విధానంలో 37 శాతం సర్‌చార్జ్ ఉంటుంది.
పన్నులు పెంచితే వచ్చే ఇబ్బందులు ఏంటి?
పిడబ్ల్యుసి (PwC) నిపుణుడు అమిత్ రాణా అభిప్రాయం ప్రకారం.. పన్ను భారం మరీ ఎక్కువగా ఉంటే పెట్టుబడిదారులు తక్కువ పన్నులు ఉండే దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. అధిక ఆదాయం ఉన్నవారే కొత్త కంపెనీలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వారిని ఇబ్బంది పెడితే దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
వెల్త్ టాక్స్ (Wealth Tax) అవసరమా?
2015లో ప్రభుత్వం వెల్త్ టాక్స్‌ను రద్దు చేసింది. దీనివల్ల వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం అలాగే దీనికి సంబంధించిన పేపర్ వర్క్, నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇప్పుడు మళ్ళీ దీనిని ప్రవేశపెడితే ఆస్తుల (బంగారం, షేర్లు, ఆస్తులు) విలువను లెక్కించడం సంక్లిష్టంగా మారుతుందని ఈవై (EY) నిపుణులు సురభి మార్వా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సర్ఛార్జ్ విధానమే సరళంగా ఉందని ఆమె సూచించారు.
మార్పులు ఉంటాయా?
డెలాయిట్ నిపుణుడు అలోక్ అగర్వాల్ ప్రకారం.. ప్రభుత్వం 2023లోనే అత్యధిక సర్ఛార్జ్‌ను 37 శాతం నుండి 25 శాతానికి తగ్గించింది. ఇంత తక్కువ సమయంలోనే మళ్ళీ పన్నులను పెంచడం సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంపైనే ఫోకస్ పెట్టాలని, కఠినమైన పన్నుల వల్ల ఇన్వెస్టర్లు దూరమయ్యే అవకాశం ఉందని గూరి పూరి వంటి విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి ఈ బడ్జెట్ (Budget 2026) లో ప్రభుత్వం మధ్యతరగతి, ధనవంతుల మధ్య పన్ను సమతుల్యతను ఎలా కాపాడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications