Budget 2026: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. నిర్మలమ్మ ప్రసంగంలో భారీ మార్పు!
సాధారణంగా యూనియన్ బడ్జెట్ ప్రసంగం అంటే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ (Part A)లో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వివరాలు ఉంటాయి. పార్ట్-బి (Part B) లో కేవలం పన్నులకు (Tax) సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఉంటాయి. కానీ, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని మార్చబోతున్నారు. ఈసారి పార్ట్-బి కేవలం పన్నులకే పరిమితం కాకుండా దేశ దీర్ఘకాలిక ఆర్థిక దార్శనికతను (Long-term Vision) ప్రతిబింబించేలా ఉండబోతోందని సమాచారం.

ఏమిటీ పార్ట్-A, పార్ట్-B వ్యత్యాసం?
సాంప్రదాయకంగా బడ్జెట్ ప్రసంగంలోని మొదటి భాగం (పార్ట్-A) దేశ ఆర్థిక స్థితిగతులు, కొత్త పథకాలను వివరిస్తుంది. రెండవ భాగం (పార్ట్-B)లో ఆదాయపు పన్ను స్లాబ్‌లు, కస్టమ్స్ డ్యూటీ వంటి అంశాలు ఉంటాయి. అయితే బడ్జెట్ (Budget 2026) లో ఆర్థిక మంత్రి పార్ట్B పై ఎక్కువ సమయం వెచ్చించనున్నారు. ప్రపంచ దేశాలకు, విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఏ దిశలో వెళ్తోందో స్పష్టంగా వివరించడమే దీని ప్రధాన ఉద్దేశం.
గ్లోబల్ ఇన్వెస్టర్లకు భరోసా!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న కొత్త సుంకాలు (Tariffs) వంటి సవాళ్ల మధ్య, భారత్ తన బలాన్ని చాటుకోవాలని భావిస్తోంది. మన దేశ ఆర్థిక స్థిరత్వం, మార్కెట్ పరిమాణం, భవిష్యత్తు వృద్ధి సామర్థ్యాన్ని విదేశీ ఇన్వెస్టర్లకు వివరించడానికి పార్ట్-B ని ఒక వేదికగా నిర్మలమ్మ వాడుకోనున్నారు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) మరింత పెరగాలంటే, ప్రభుత్వ విధానాలపై ఇన్వెస్టర్లకు స్పష్టమైన భరోసా ఇవ్వడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
21వ శతాబ్దపు రెండో పాదంపై దృష్టి
21వ శతాబ్దపు రెండో పాదంలోకి (Second Quarter) అడుగుపెడుతున్న తరుణంలో భారత్ తన ఆర్థిక దిశను స్పష్టంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం తక్షణ పన్ను ప్రతిపాదనలే కాకుండా రాబోయే ఐదేళ్లలో దేశం ఎలా ఎదగాలి అనే 'స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్'ను పార్ట్-B లో వివరించనున్నారు. గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే కూడా పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచడానికి బహుముఖ వ్యూహం కావాలని సూచించింది.
స్థానిక బలాలు - అంతర్జాతీయ వేదిక
భారతదేశం తన స్థానిక తయారీ రంగం (Local Strengths) .. ప్రస్తుత ఆర్థిక సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి ఈ బడ్జెట్ ను ఒక అవకాశంగా మలుచుకోనుంది. ప్రభుత్వం కేవలం తాత్కాలిక ఊరటలకే పరిమితం కాకుండా, స్థిరమైన వృద్ధిని (Sustained Growth) ఎలా కొనసాగిస్తుందో ఈ ప్రసంగం ద్వారా తెలియజేయనుంది.
మొత్తానికి ఈసారి బడ్జెట్(Budget 2026) ప్రసంగం కేవలం అంకెల గారడీగా కాకుండా భారతదేశ ఆర్థిక భవిష్యత్తుకు ఒక దిక్సూచిలా ఉండబోతోందని స్పష్టమవుతోంది. మరి నిర్మలమ్మ తన పార్ట్-B ప్రసంగంలో ఇన్వెస్టర్లకు, సామాన్యులకు ఎలాంటి తీపి కబురు అందిస్తారో చూడాలి!


Click it and Unblock the Notifications