Budget 2026: కంపెనీలకు ఒక రూల్.. సామాన్యుడికి మరో రూలా? బడ్జెట్లో ఇది ఉండాల్సిందే అంటూ డిమాండ్!
ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర పడుతుందంటే చాలు, సామాన్యుడి కళ్లు ఢిల్లీ వైపు చూస్తుంటాయి. వచ్చే బడ్జెట్ (Budget 2026) లోనైనా తమకు కాస్త ఊరట లభిస్తుందా? అని ఎదురుచూడటం మధ్యతరగతి వర్గాలకు అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ హిమాంక్ సింగ్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. శాలరీ తీసుకునే వ్యక్తులు కేవలం తమ మనుగడ కోసమే పన్నులు చెల్లిస్తున్నారని, వారి ఎదుగుదల కోసం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు.

కంపెనీలకు ఒక రూల్.. సామాన్యుడికి మరో రూలా?
సాధారణంగా ఏదైనా వ్యాపారం లేదా కంపెనీ ఆదాయంపై పన్ను లెక్కించేటప్పుడు, వారు చేసిన ఖర్చులన్నీ పోను మిగిలిన 'నికర లాభం' (Net Profit) పైనే ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. కానీ, ఒక ఉద్యోగి విషయానికి వస్తే మాత్రం కథ మొత్తం మారుతుంది. జీతం క్రెడిట్ అవ్వగానే చేతికి రాకముందే పన్ను కట్ అవుతుంది. హిమాంక్ సింగ్లా వాదన ప్రకారం.. కంపెనీలకు వర్తించే అదే సూత్రం సామాన్యులకు కూడా వర్తించాలి. వ్యాపారాలు తమ అద్దెలు, వడ్డీలు, ఉద్యోగుల ఖర్చులను మినహాయించుకున్నట్లే, సామాన్యుడికి కూడా నిత్యావసర ఖర్చుల తర్వాత మిగిలిన దానిపైనే పన్ను వేయడం సబబు.
రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ సరిపోతుందా?
ప్రస్తుతం ఉన్న రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది నేటి పెరిగిన ధరల దృష్ట్యా ఏ మూలకు సరిపోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో దీనిపై మార్పులు ఉండాలని వారు కోరుతున్నారు. 10 లక్షల జీతం ఉన్న వ్యక్తికి, 50 లక్షల జీతం ఉన్న వ్యక్తికి ఒకే రకమైన స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలను విస్మరించినట్లవుతుంది. దీనికి బదులుగా 'పర్సంటేజ్' ఆధారిత మినహాయింపు ఇస్తే.. పెరిగిన ధరలకి అనుగుణంగా అందరికీ న్యాయం జరుగుతుందని సింగ్లా సూచించారు.
ఖర్చులు పోగా మిగిలేది ఎంత?
ఒక సాధారణ నగరవాసి సంపాదనలో 30 నుండి 40 శాతం కేవలం ఇంటి అద్దెకే సరిపోతోంది. దీనికి తోడు పిల్లల చదువులు, హెల్త్ ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు ఇవన్నీ లగ్జరీ కావు. ఇవి తప్పనిసరి ఖర్చులు. ఇవన్నీ పోయాక మిగిలేది చాలా తక్కువ. ఆ మిగిలిన సొమ్ము భవిష్యత్తు అవసరాలకు లేదా అత్యవసర పరిస్థితుల కోసం దాచుకునేది. కానీ, ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా గ్రాస్ శాలరీపై ట్యాక్స్ వేయడం వల్ల మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది.
బడ్జెట్ 2026 పై ఆశలు
నిజాయితీగా పన్నులు కట్టే శాలరీ క్లాస్ వ్యక్తులు తమ ఆదాయాన్ని దాచుకోలేరు, తప్పుడు లెక్కలు చూపలేరు. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ (Budget 2026) లో ఈ నిర్మాణాత్మక లోపాలను సరిదిద్దుతారని లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం పన్ను తగ్గింపు మాత్రమే కాదు. సామాన్యుడి ఆర్థిక మనుగడకు సంబంధించిన సమస్య.
ఏదేమైనా ఈ సారి బడ్జెట్ లో వ్యాపారాలకు ఉన్నట్లుగానే, సామాన్యుడికి కూడా నిత్యావసర ఖర్చులు పోను మిగిలిన 'నికర ఆదాయం' (Net Income) పై మాత్రమే పన్ను విధించేలా నిబంధనలను మార్చితే మధ్య తరగతి బతుకులు కొంతవరకూ మారే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి!


Click it and Unblock the Notifications