budget 2020: రూపాయి రాక-పోక ఇలా, కీలక శాఖలకు భారీ కేటాయింపులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు కేటాయింపులను ప్రస్తావించారు. కీలకంగా ఉన్న శాఖలకు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరిపారు.

ఏయే శాఖలకు పెద్ద పీటవేశారంటే..
హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖకు రూ. 50040 కోట్లు కేటాయించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ. 67,112 కోట్లు, రైల్వే శాఖకు 72,216 కోట్లు, రోడ్డు, రవాణా హైవేల మంత్రిత్వ శాఖకు రూ. 91,823 కోట్లు, మానవ వనరుల మంత్రిత్వశాఖకు రూ. 99,312 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,22,398 కోట్లు కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే గ్రామీణాభివృద్ధికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.

ఈ శాఖలకు అధిక కేటాయింపులు..
కన్స్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖకు రూ. 1,24,535 కోట్లు, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ. 1,42,762 కోట్లు, రూ. హోంశాఖకు రూ. 1,67,250 కోట్లు, రక్షణ శాఖకు రూ. 4,71,378 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఈ కేటాయింపులను బట్టి చూస్తే వ్యవసాయం, రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

రూపాయి రాకడ..
వివిధ విభాగాల నుంచి ప్రభుత్వానికి రూపాయి(ఆదాయం) ఎలా వస్తుందో చూద్దాం.. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ ద్వారా 6శాతం, రుణాలు, ఇతర అప్పుల ద్వారా 20శాతం, నాన్ టాక్స్ రెవెన్యూ 10 శాతం, కస్టమ్స్ 4 శాతం, జీఎస్టీ 18 శాతం, కార్పొరేట్ టాక్స్ 18 శాతం, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ 7శాతం, ఆదాయపుపన్ను ద్వారా 17 శాతం ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది.

రూపాయి పోకడ..
ఇక వివిధ విభాగాలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న రూపాయి(వ్యయం) గురించి తెలుసుకుందాం.. పెన్షన్లకు 6 శాతం, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్ పథకాలకు 9 శాతం, సబ్సిడీలు 6 శాతం, రక్షణకు 8 శాతం, వడ్డీ చెల్లింపులకు 18 శాతం, రాష్ట్రాలకు పంచే టాక్స్, డ్యూటీస్ 20 శాతం, ఫైనాన్స్ కమిషన్, ఇతర బదలాయింపులు 10 శాతం, సెంట్రల్ సెక్టార్ స్కీంలకు 13 శాతం, ఇతర వ్యయాలు 10శాతం ఉన్నాయి.


Click it and Unblock the Notifications