Budget 2020: వైద్యానికి పెద్దపీట, ఆయుష్మాన్ ఆస్పత్రులు, కేటాయింపులు ఇలా
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. శనివారం ఉదయం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. వైద్య రంగానికి రూ. 69,000 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకమని వివరించారు. పీపీపీ పద్ధతిలో ఆయుష్మాన్ భారత్ స్కీం కింద 112 జిల్లాలోని టైర్-II, టైర్III పట్టణాలు, నగరాల్లో ఆస్పత్రులను నెలకొల్పుతామని మంత్రి తెలిపారు.

దేశంలో ఆయుష్మాన్ భారత్ అమలు కాని జిల్లాల్లో ఈ ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఈ ఆస్పత్రులకు రూ. 6000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
మెడికల్ డివైసెస్‌లపై విధించే పన్నుల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆస్పిరేషనల్ జిల్లాల్లో మౌలికసదుపాయాల కోసం ఉపయోగిస్తామని మంత్రి తెలిపారు. 2025 వరకు టీబీని భారతదేశం నుంచి తరిమేస్తామని స్పష్టం చేశారు. టీబీ ఓడిపోతుంది.. ఇండియా గెలుస్తుందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
మంచి నీటి కోసం 'జల్ జీవన్ మిషన్' పథకాన్ని తీసుకొచ్చామని, ప్రాథమిక ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు సానిటేషన్ ప్రోగ్రాం 'స్వచ్ఛ భారత్ యోజన' తీసుకొచ్చామని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ఈ సంవత్సరం రూ. 12,300 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.


Click it and Unblock the Notifications