ఆర్డర్ చేస్తే గంటలో బ్రిటానియా ఉత్పత్తులు మీ ఇంటికి, త్వరలో హైదరాబాద్‌లో..
దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు అందించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ డంజోతో జత కట్టింది బ్రిటానియా ఇండస్ట్రీస్. బ్రిటానియా ఎస్సెన్షియల్ స్టోర్‌లో ఆర్డర్ చేస్తే గంటలోపు డంజో యాప్ సాయంతో కస్టమర్ల ఇళ్లకు ఆర్డర్ చేసిన వస్తువులు చేరుతాయని బ్రిటానియా తెలిపింది.

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో అందుబాటులోకి
మొట్టమొదటి స్టోర్‌ను మంగళవారం బెంగళూరులో ప్రారంభించింది. డంజోతో కలిసి ఎనిమిది ప్రధాన నగరాల్లో గంటలోపు కస్టమర్లకు వస్తువులు అందించనుంది. ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్‌లతో పాటు ముంబై, పుణే, ఢిల్లీ, గురుగ్రామ్, జైపూర్, చెన్నై ఉన్నాయి. తొలుత బెంగళూరులో ప్రారంభించారు. క్రమంగా మిగతా నగరాలకు విస్తరిస్తారు.

బిస్కట్స్, కేక్స్ సహా వివిధ ఐటమ్స్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ సమయంలో కస్టమర్లకు ఉత్పత్తులు అందించాల్సి ఉందని ఇందుకు డంజో ప్లాట్ ఫామ్ సాయంతో డెలివరీ చేసేందుకు జతకట్టామని బ్రిటానియా ఎండీ వరుణ్ బెర్రీ అన్నారు. బ్రిటానియా బిస్కెట్లు, కేక్స్, రస్క్, మిల్క్ షేక్స్, వేపర్స్, నెయ్యి వంటి వివిధ ఐటమ్స్ ఉన్నాయి.

నాన్-కాంటాక్ట్ డెలివరీ సేవలు
వినియోగదారులు ఈ వస్తువుల కోసం డంజో యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఇలా ఆర్డర్ చేసిన వస్తువులు గంటలోపు అందుతాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నాన్-కాంటాక్ట్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ సేవలు బెంగళూరులో 7వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్ హోమ్ డెలివరీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో బ్రిటానియా ఈ సేవలతో ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications