ముంబై: మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ రూపొందించిన ఓ వాణిజ్య ప్రకటన దుమారం రేపుతోంది. వివాదాస్పదమైంది. బాలీవుడ్ నటి, టాప్ మోడల్ కరీనా కపూర్ ఖాన్ నటించిన యాడ్ ఇది. కరీనా కపూర్‌తో అక్షయ తృతీయ కోసం మలబార్ గోల్డ్ యాజమాన్యం ప్రత్యేకంగా దీన్ని చిత్రీకరించింది. ఈ యాడ్ మార్కెట్‌లోకి విడుదలైన కొద్దిసేపటికే ప్రకంపనలను సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాయ్‌కాట్ మలబార్ గోల్డ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ యాడ్ ఫొటోలో కరీనా కపూర్ నుదుటిపై బొట్టు లేకుండా కనిపించడమే దీనికి ప్రధాన కారణం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన హిందూ పండగ కోసం రూపొందించిన ఈ యాడ్‌లో హైందవ సంస్కృతికి భిన్నంగా.. బొట్టు లేకుండా కరీనా కపూర్ కనిపించడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. #BoycottMalabarGold, #NoBindiNoBusiness అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్‌ల మీద వేల సంఖ్యలో కామెంట్స్ పడుతున్నాయి.

లేత గులాబీ రంగు లెహంగా ధరించి, రౌండ్ షేప్ డైమండ్ నెక్లెస్, దానికి మ్యాచ్ అయ్యే చెవిదుద్దులు, పాపిడి బిల్లను ధరించింది కరీనా కపూర్. ఆమె నుదుటన బొట్టు మాత్రం లేదు. బోసిగా కనిపించింది. ఇది కాస్తా నెటిజన్లను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. దీన్ని ఎత్తిచూపుతూ వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు.
కార్పొరేట్ శక్తులు హిందూ వ్యతిరేక సంస్కృతిని జనంలోకి చొప్పించే ప్రయత్నం చేస్తోందంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. హిందూ సంప్రదాయాలు, పండగలను మరిచిపోయేలా చేస్తోన్నాయని, ఇందులో భాగంగా- ఉద్దేశపూరకంగా ఇలాంటి వాణిజ్య ప్రకటనలను రూపొందిస్తున్నాయని భగ్గు మంటున్నరు. అక్షయ తృతీయ వంటి హిందూ పండగ, హిందువుల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తోన్న మలబార్ గోల్డ్ యాజమాన్యం.. అదే హిందువులను కించపరిచేలా యాడ్‌ను షూట్ చేయడం సరికాదని అంటున్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, జ్యువెలరీస్ యాజమాన్యం హిందూ వ్యతిరేకిగా పని చేస్తోందని మండిపడుతున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications