న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కేంద్ర టెలికాం శాఖకు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవిన్యూ బకాయిలు రూ.8004 కోట్లు చెల్లించినట్లు ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ వెల్లడించింది. అంతకుముందు రూ.10వేల కోట్లు ఎయిర్‌టెల్ కేంద్ర టెలికాం శాఖకు ఫిబ్రవరి 17న చెల్లించింది. స్వీయమదింపు ప్రాతిపదికన 2019 డిసెంబర్ 31వరకు చెల్లించాల్సిన బకాయిలను లెక్కగట్టిందని అయితే ఫిబ్రవరి 29, 2020 వరకు వడ్డీతో పాటు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించినట్లు కంపెనీ తెలిపింది.
2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి 2019 డిసెంబర్ 31వరకు కంపెనీ సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసిందని వడ్డీని ఫిబ్రవరి 29, 2020 వరకు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆమేరకు చెల్లింపులు జరిపామని భారతీ ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఫిబ్రవరి 17న రూ.10వేల కోట్లు అడ్‌హాక్ అమౌంట్ కింద చెల్లించినట్లు చెప్పిన భారతీ ఎయిర్‌టెల్ వడ్డీ కింద రూ.3004 కోట్లు చెల్లించి ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకుందని స్పష్టం చేసింది. ఇక భారతీ ఎయిర్‌టెల్, భారతీ హక్సాకామ్, టెలినార్ ఇండియాలకు సంబంధించి చెల్లింపులు జరిపినట్లు వెల్లడించింది.

ఇక కేంద్ర టెలికాం శాఖ వద్ద మరో రూ.5వేల కోట్లు అదనంగా చెల్లించామని అసలు చెల్లింపుల్లో ఏమైనా చిన్నపాటి తేడాలు లేదా అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటే ఈ రూ.5వేల కోట్ల నుంచి తీసుకోవచ్చని లేనిపక్షంలో తిరిగి రీఫండ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ వివరించింది.
ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్ మొత్తం రూ.35,586 కోట్లు టెలికాంశాఖకు కట్టాల్సి ఉంది. ఇందులో లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగపు ఛార్జీలు ఉన్నాయి. చెల్లించకపోవడంతో వడ్డీతో సహా కట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే బకాయిలన్నిటినీ వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 24, 2019న తీర్పు చెప్పింది. ఇప్పుడు తీర్పును గౌరవిస్తూ మొత్తం బకాయిలు వడ్డీతో సహా చెల్లించినట్లు ఎయిర్‌టెల్ తన ఫైలింగ్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications