ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ (One 97 Communications)కు చెందిన పేటీఎం (Paytm share price) షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే గరిష్ఠంగా 43 రూపాయలను కోల్పోయిందా సంస్థ. ఆ తరువాత కోలుకున్నప్పటికీ అది నామమాత్రమే.
దీనికి కారణం లేకపోలేదు. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త వారెన్ బఫెట్ (Warren Buffet) ఈ కంపెనీలో ఉన్న తన షేర్లను అమ్ముకోవడమే. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బల్క్ డీల్ కింద 1.56 కోట్ల షేర్లను అమ్ముకున్నారాయన. దీని విలువ 1,370 కోట్ల రూపాయలు. ఎన్ఎస్ఈ (NSE)లో పేటీఎం (Paytm) షేర్ ధర 877 రూపాయల వద్ద ఉన్నప్పుడు వాటిని విక్రయించారు.

దీని ఫలితం- పేటీఎం షేర్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేసింది. వాటి మార్కెట్ వేల్యూను దెబ్బకొట్టింది. శుక్రవారం ఒకదశలో 920 రూపాయల వద్ద ట్రేడ్ అయింది ఈ కంపెనీ సింగిల్ షేర్. ఆ తరువాత క్షీణించింది. 877 రూపాయలకు పడిపోయింది. ఆ దశలో వారెన్ బఫెట్ తన వాటా షేర్లను విక్రయించారు.
పేటీఎం పబ్లిక్ ఇష్యూ వచ్చిన సమయంలో వారెన్ బఫెట్‌కు చెందిన కంపెనీ బెర్క్‌షైర్ హాథ్‌వే (Berkshire Hathway) ఈ షేర్లను కొనుగోలు చేసింది. అప్పట్లో ఒక్కో షేర్ విలువ కటాఫ్ ప్రైస్ 2,150 రూపాయలు. స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ సమయంలో భారీగా నష్టాలను పంచింది పేటీఎం. ఒక్కరోజు కూడా కటాఫ్ మార్క్‌ను అందుకోలేదు. ఒక దశలో కనిష్ఠంగా రూ.438.35 పైసలకు దిగజారింది.
ఆ తరువాత క్రమంగా పెరుగుతూ గరిష్ఠంగా రూ.998. 30 పైసలకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నానికి ఒక్కో షేర్ ప్రైస్ రూ.892.55 పైసల వద్ద ట్రేడింగ్ ముగిసింది. వారెన్ బఫెట్.. పేటీఎం నుంచి తప్పుకోవడం మున్ముందు షేర్ల ధరలను మరింత ప్రభావితం చేస్తుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.


Click it and Unblock the Notifications