Bengaluru: డీకే శివకుమార్ హింట్ ఇచ్చేశారు.. బెంగళూరు సెకండ్ ఎయిర్‌పోర్ట్ డెస్టినేషన్ ఇదే!
కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ అయిన బెంగళూరు (Bengaluru) నగరంలో ప్రయాణ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నగరం నార్త్ సైడ్ ఉండటంతో, దక్షిణ బెంగళూరు వాసులు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే ఒక యుద్ధమే చేయాల్సి వస్తోంది. అయితే, ప్రయాణికుల ఈ ఇబ్బందులను దూరం చేస్తూ.. బెంగళూరుకు రెండో విమానాశ్రయం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, దక్షిణ బెంగళూరులోని కనకపుర రోడ్ ఈ మెగా ప్రాజెక్టుకు హాట్ ఫేవరెట్‌గా మారింది.

కనకపుర రోడ్ ఎందుకు బెస్ట్ చాయిస్?
రెండో విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం మూడు ప్రధాన ప్రాంతాలను పరిశీలించింది. ఇందులో కనకపుర రోడ్‌లోని చూడాహళ్లి, సోమనహళ్లి ఒకటయితే, తుమకూరు రోడ్ వైపు ఉన్న నెలమంగళ-కుణిగల్ మధ్య ప్రాంతం మరొకటి. అయితే, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ దక్షిణ బెంగళూరు వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ల్యాండ్ లభ్యత. కనకపుర రోడ్ సమీపంలో రెండు సైట్లు పక్కపక్కనే ఉండటం విశేషం. ఒకటి 4,800 ఎకరాలు, మరొకటి 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఒకే "పర్ఫెక్ట్ ల్యాండ్ పార్సెల్"గా మార్చి విమానాశ్రయాన్ని నిర్మించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
కనెక్టివిటీ , డిమాండ్
దక్షిణ బెంగళూరులో ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల కనెక్టివిటీ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెలమంగళ ప్రాంతంతో పోలిస్తే, కనకపుర సైడ్ భూ సేకరణకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా, సౌత్ బెంగళూరులో ఎయిర్‌పోర్ట్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నెలమంగళ వైపు విమానాశ్రయం ఉంటే ఉత్తర కర్ణాటక వాసులకు ఉపయోగపడుతుందని కొందరు వాదించినప్పటికీ, ట్రాఫిక్ డిమాండ్ , విమానయాన పరిమితుల (Airspace restrictions) పరంగా కనకపుర రోడ్ సైట్లే మెరుగ్గా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిపుణుల అధ్యయనం ప్రారంభం
ఈ భారీ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను (Feasibility) పరిశీలించడానికి ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్డ్ ఈపీసీఎం (Meinhardt EPCM) అనే కన్సల్టెన్సీని నియమించింది. సుమారు 4.96 కోట్ల రూపాయల కాంట్రాక్టుతో ఈ సంస్థ మూడు ప్రాంతాల్లో టెక్నికల్ అంశాలను, ట్రాఫిక్ డిమాండ్‌ను పరిశీలిస్తుంది. మరో ఐదు నెలల్లో ఈ నివేదిక వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ వర్గాలు మాత్రం కనకపుర రోడ్ సైడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
బెంగళూరు(Bengaluru) నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడున్న ఎయిర్‌పోర్ట్ రాబోయే రోజుల్లో రద్దీని తట్టుకోవడం కష్టమే. అందుకే ఈ రెండో విమానాశ్రయం నగరం భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఒకవేళ కనకపుర రోడ్ లో ఎయిర్‌పోర్ట్ ఖరారైతే, ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ , ఇతర మౌలిక సదుపాయాలు ఊహించని రేంజ్ లో డెవలప్ అవుతాయి. దక్షిణ బెంగళూరు ప్రజలకు ఎయిర్‌పోర్ట్ ప్రయాణం ఇక చిటికెలో పని అవుతుంది!


Click it and Unblock the Notifications