Bengaluru: సిలికాన్ వ్యాలీలో ఏఐ ప్రకంపనలు! ఉద్యోగాల కోతపై కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన!
భారతదేశ టెక్ రాజధాని బెంగళూరు (Bengaluru) గురించి ప్రస్తావించకుండా దేశ భవిష్యత్తు గురించి మాట్లాడలేం. ప్రపంచ స్థాయి దిగ్గజ నేతలు కూడా ఢిల్లీ వెళ్లడానికి ముందే బెంగళూరును సందర్శిస్తారని, అంతటి ప్రాముఖ్యత ఈ నగరానికి ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK shiva kumar) గర్వంగా చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులను కలవరపెట్టే ఒక పెద్ద విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో, ఇది భవిష్యత్తులో ఉద్యోగాలపై పెను ప్రభావం చూపబోతోందని ఆయన హెచ్చరించారు.

50 శాతం ఉద్యోగాలు పోయే అవకాశం!
నెట్‌వర్క్ 18 నిర్వహించిన 'ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సమ్మిట్'లో మాట్లాడిన శివకుమార్, ఏఐ కారణంగా బెంగళూరుతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్ంతం చేశారు. ప్రస్తుతం బెంగళూరులో 22.6 మిలియన్ల మంది ఐటీ నిపుణులు ఉన్నారని, ఇంతటి టాలెంట్ పూల్ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆయన కొనియాడారు. కానీ, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్రమత్తంగా ఉండకపోతే ఉద్యోగ నష్టం తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ఏఐ అనేది ఒక పెద్ద సవాలుగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముంబై కంటే బెంగళూరే చౌక
రియల్ ఎస్టేట్ , జీవన వ్యయం గురించి మాట్లాడుతూ.. ముంబై కంటే బెంగళూరు ఎంతో మెరుగైనదని డీకే శివకుమార్ చెప్పారు. ముంబైలో రెంటల్ స్పేస్ కోసం 3.5 డాలర్లు ఖర్చయితే, బెంగళూరులో కేవలం 1 డాలర్‌తోనే మేనేజ్ చేయవచ్చని ఆయన ఉదాహరణగా చెప్పారు. అంటే ముంబై కంటే బెంగళూరులో ఉండటం సామాన్యులకు, ఐటీ ఉద్యోగులకు ఎంతో లాభదాయకం అన్నమాట. అంతేకాకుండా, నగరం దక్షిణ భాగంలో కొత్త విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గి, కనెక్టివిటీ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్లోబల్ టెక్కు అడ్డా.. బెంగళూరు!
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ, ప్రపంచంలోని 'ఫార్చ్యూన్ 500' కంపెనీలన్నీ బెంగళూరులోనే ఉన్నాయని గుర్తు చేశారు. గ్లోబల్ టెక్ దిగ్గజం ఎన్వీడియా (Nvidia) కూడా బెంగళూరులో 7.6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. సెమీకండక్టర్ రంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుపై సంతకం చేసిందని తెలిపారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
అయితే, ఆయన కూడా ఏఐ వల్ల ఉద్యోగ నష్టం జరుగుతుందనే విషయాన్ని అంగీకరించారు. "సర్వీస్ సెక్టార్‌లో మనం దేశంలోనే నంబర్ వన్. ఇప్పుడు మనం ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. మన దగ్గర టాలెంట్ ఉంది కానీ, ఈ మార్పు వల్ల ఉద్యోగాల కోత అనేది ఒక సవాలుగా మారుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి బెంగళూరు (Bengaluru) నగరం ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నప్పటికీ, ఏఐ రూపంలో రాబోతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఐటీ నిపుణులు కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications