కరోనా సెకండ్ వేవ్‌తో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలు, థర్డ్ వేవ్‌తో లాక్ డౌన్ విధిస్తే...
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి రేటును సవరించింది ప్రముఖ బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్‌లేస్. వృద్ధి రేటు అంచనాలను 0.80 శాతం మేర తగ్గించి 9.2 శాతంగా అంచనా వేసింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీని నుండి కోలుకునే సమయంలోనే సెకండ్ వేవ్ వచ్చింది. వ్యాక్సినేషన్ నెమ్మదిగా కొనసాగుతుండటం, అలాగే, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు వృద్ధి రేటు తగ్గడానికి కారణాలుగా పేర్కొంది. ఈ రెండు అంశాలు వృద్ధి రేటుపై ప్రభావం చూపుతున్నట్లు బార్క్‌లేస్ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా తెలిపారు.

నిపుణుల అంచనా
గత నెలలో కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) భారత వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతంగా అంచనా వేసింది. బార్క్‌లేస్ కూడా 9.2 శాతంగా అంచనా వేస్తోంది. ఆర్థిక నిపుణులు, సంస్థలు భారత జీడీపీ వృద్ధి రేటును 8.5 శాతం నుండి 10 శాతానికి కాస్త పైన అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయని, అయినప్పటికీ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్, కొత్త కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుదుటపడుతోందని తెలిపింది.

74 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం
కరోనా కేసులు ఏప్రిల్ నెల నుండి రోజుకు 3 నుండి 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో రోజుకు 4500 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని బార్క్‌లేస్ భారత జీడీపీ వృద్ధి రేటును అంచనా వేసింది. జూన్ చివరి వరకు లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థకు 74 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం ఉంటుందని బార్క్‌లేస్ అంచనా వేసింది.

కరోనా థర్డ్ వేవ్ వస్తే...
వ్యాక్సినేషన్ నెమ్మదిగా కొనసాగటం, ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ ఆందోళన ప్రభావం భారత ఆర్థికవ్యవస్థపై ఉంటుందని బార్క్‌లేస్ అభిప్రాయపడింది. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ ఉంటే, మరో ఎనిమిది వారాల పాటు లాక్ డౌన్ విధిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందని, అప్పుడు వృద్ధి రేటు మరింత పతనమై 7.7 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications