కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడటంతో బ్యాంకులు ఎన్పీఏలు నాలుగు శాతం పెరగవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల మొండి బకాయిలు, ఎన్పీఏలు వాటి మొత్తం రుణాల్లో కనీసం 12.5% చేరుకోవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. రుణాల నాణ్యతపై ఒత్తిళ్లు మరింత పెరిగితే 14.7% చేరుకోవచ్చునని తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. ఎన్పీఏలు 20 ఏళ్ల గరిష్టానికి చేరుకునే అవకాశముందని తెలిపింది.

భారీగా పెరగనున్న ఎన్పీఏలు..
గత మార్చి నాటికి 8.5% ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నిరర్థక ఆస్తులు వచ్చే మార్చి నాటికి కనీస స్థాయిలో 12.5% చేరుకోవచ్చునని తెలిపింది. స్థూల ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారితే ఎన్పీఏలు మరింత పెరిగి 14.7% చేరే అవకాశముందని ఆర్బీఐ తెలిపింది. స్థూల ఆర్థిక ఒడిదుడుకుల వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ పైన, క్యాపిటల్ టు రిస్క్-వెయిటెడ్ అసెట్స్ రేషియోపై పన్నెండు నెలల పాటు ఉండే ఒత్తిళ్లను కనీసం, మధ్యస్థం, అధికం, మరింత అధికం.. నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తారు. ఈ ఒత్తిళ్లు కనీసస్థాయిలో ఉంటే గత మార్చి నాటికి 11.3% ప్రభుత్వ బ్యాంకుల ఎన్పీఏల నిష్పత్తి వచ్చే మార్చి నాటికి 15.2% పెరుగవచ్చునని అంచనా వేసింది. ప్రయివేటు బ్యాంకుల విషయానికి వస్తే 4.2% నుండి 7.3% శాతానికి, విదేశీ బ్యాంకుల ఎన్పీఏలు 2.3% నుండి 3.9% చేరుకోవచ్చునని తెలిపింది.

లాభదాయకతపై ప్రభావం
వాస్తవానికి 2018-19తో పోలిస్తే 2019-20లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగానే ఉన్నాయి. కానీ 2019-20 ఒక్క ద్వితీయార్థంలో మందగమనం వల్ల తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు మరింత భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు తగ్గుతున్న డిపాజిట్స్, మరోవైపు ఎన్పీఏలు పెరిగి ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కోవచ్చు.

ఆర్థిక వ్యవస్థ భేష్
కరోనా భయం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొన్నారు. నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు రుణదాతలు అతిగా విముఖత ప్రదర్శించవద్దన్నారు. నష్ట భయాన్ని ఎదుర్కొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం రుణదాతలు నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు విముఖత చూపుతుండటంతో అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు.


Click it and Unblock the Notifications