ఆటో దిగ్గజం బజాజ్ ఆటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1 లక్ష కోట్లను క్రాస్ చేసింది. కంపెనీ స్టాక్స్ మంగళవారం రాణించడంతో లక్ష కోట్ల క్లబ్‌లో చేరడం ద్వారా అరుదైన మైలురాయిని తాకింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో. ఇంతకుముందు మారుతీ సుజకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇటీవల పలు కంపెనీలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. టీసీఎస్ గత నెలలో రూ.10 లక్షల కోట్ల మార్క్, ఇన్ఫోసిస్ కొద్ది రోజుల క్రితం రూ.5 లక్షల కోట్ల మార్క్, బజాజ్ ఫైనాన్స్ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటాయి. తాజాగా బజాజ్ ఆటో రూ.1 లక్ష కోట్లను క్రాస్ చేసింది.

ఏడాదిలో 8.3 శాతం జంప్
బజాజ్ ఆటో స్టాక్ ధర ఉదయం ఓ సమయంలో రూ.3,459.90ని దాటింది. మధ్యాహ్నం ఒకటి గంట సమయానికి రూ.3,431 వద్ద ట్రేడ్ అయింది. ప్రారంభంలో రూ.3,459ని తాకినప్పుడు ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.01 లక్షల కోట్లుగా నమోదయింది. క్రితం సెషన్లో బజాజ్ ఆటో స్టాక్ రూ.3,414 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 1 శాతానికి పైగా లాభపడింది. ఏడాదిలో బజాజ్ ఆటో స్టాక్ 8.3 శాతం వరకు ఎగిసింది. ప్రారంభ నష్టాన్ని కోల్పోయినప్పటికీ మధ్యాహ్నం సమయానికి 0.55 శాతం లాభంతో ట్రేడ్ అయింది.

పడిలేచిన బజాజ్ ఆటో స్టాక్
కరోనా నేపథ్యంలో మార్చి 23న అన్ని రంగాలు, అన్ని స్టాక్స్ తీవ్రంగా పతనమైన విషయం తెలిసిందే. బజాజ్ ఆటో కూడా ఆ రోజు రూ.1935 స్థాయికి పడిపోయింది. అంతకుముందు ఈ స్టాక్ ధర రూ.3,300కు పైన ఉంది. ఏప్రిల్ నుండి ఆటో సేల్స్ లేకపోవడంతో ఆటో షేర్లు కూడా అంతగా పుంజుకోలేదు.
అన్‌లాక్ తర్వాత, అనంతరం ఆగస్ట్ నుండి ఆటో సేల్స్ క్రమంగా పెరగడంతో ఆటో స్టాక్స్ కూడా పుంజుకున్నాయి. ఇందులో భాగంగా బజాజ్ ఆటో రూ.1935 నుండి ఇప్పుడు రూ.3,426 స్థాయికి చేరింది. మధ్యాహ్నం సమయానికి బజాజ్ ఆటో స్టాక్ నేటి గరిష్టం (రూ.3459) నుండి స్వల్పంగా తగ్గింది. రూ.3414.00 వద్ద మార్కెట్ క్యాప్ రూ.98789.90 వద్ద ఉంది. రూ.3,426తో లక్ష కోట్ల మార్కు వద్ద ఉంది.

టాప్ 5 కంపెనీలు
2020లో ఐదు కంపెనీలు రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటి క్యాలెండర్ ఇయర్‌ను ముగిస్తున్నాయి. ఇందులో రిలయన్స్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.12.70 లక్షల కోట్లు, టీసీఎస్ రూ.10.90 లక్షల కోట్లు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.7.69 లక్షల కోట్లు, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.5.63 లక్షల కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.5.26 లక్షల కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications