కొన్ని కీలక అంశాల పరిష్కారంపై దృష్టి సారించకుండా మొండి బకాయిల కోసం ప్రత్యేకంగా బ్యాంకు లేదా బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ, సీఐఐ కొత్త ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అన్నారు. వసూళ్ల శాతం మెరుగుకాకుండా, పారదర్శకత వంటి కీలక అంశాల్ని సరిచేయకుండా నిరర్థక ఆస్తుల(NPA) సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు పెట్టి ప్రయోజనం లేదన్నారు.

ఇలా చేస్తేనే బ్యాడ్ బ్యాంకుకు అర్థం
మొండి బకాయిల్ని బ్యాడ్ బ్యాంకుకు ఏ రేటుకు విక్రయిస్తారో తెలియాలని, ఇది పారదర్శకంగా, సముచిత విధంగా ఉండాలన్నారు. ఎన్పీఏలను ఏ ధర ప్రకారం బ్యాడ్ బ్యాంకుకు బదలీ చేయాలో నిర్ణయించాలని, ఇది పారదర్శక వ్యవస్థ ద్వారా జరగాలన్నారు. బ్యాడ్ బ్యాంకు పాలన కూడా స్పష్టంగా ఉండాలన్నారు. రికవరీ చాలా ముఖ్యమైన అంశమన్నారు. రికవరీ మెరుగుపడితేనే బ్యాడ్ బ్యాంకుకు అర్థం ఉంటుందన్నారు.

గతానుభవం
ఐడీబీఐ బ్యాంకు ఒత్తిడికి గురవుతున్న ఆస్తుల స్థిరీకరణ నిధిని 2004-05లో ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఐడీబీఐ ఎన్పీఏలలో కొంత ఆ నిధికి బదలీ అయ్యేవన్నారు. రూ.9000 కోట్ల విలువైన ఆస్తులను బదలీ చేయగా, 2013 మార్చి నాటికి రూ.4000 కోట్ల కంటే తక్కువ మాత్రమే రికవరీ అయ్యాయన్నారు. నిరర్థక ఆస్తులు పెరిగినప్పుడల్లా బ్యాడ్ బ్యాంకు ప్రస్తావన వస్తుందన్నారు.

పెట్టుబడులకు సమయం
వృద్ధిని తిరిగి సాధించడం చర్చనీయాంశమేమీ కాదని ఉదయ్ కొటక్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కార్పోరేట్లు ఆలోచనా ధోరణి మార్చుకునే సమయం వచ్చిందని, పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాయికి మించి రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా సంక్షోభంలో అవకాశమున్న వ్యాపారాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్నారు.

విద్య, వైద్యంలో పెట్టుబడులు
కార్పోరేట్ గవర్నెన్స్ బలహీనంగా ఉండటం, అధిక రుణాల వల్ల ఇదివరకు మన పరిశ్రమలను దెబ్బతీశాయన్నారు. తక్కువ స్థిర వ్యయాలు, రుణాలు కలిగిన సంస్థలు మెరుగ్గా రాణిస్తాయన్నారు. దీర్ఘకాల రుణరేట్లు తగ్గడాన్ని పెట్టుబడులకు పెట్టుబడులకు పరిగణలోకి తీసుకోవాలన్నారు.

ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఏడాది
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్వస్థితికి రావడానికి ఏడాది పట్టవచ్చునని ఉదయ్ కొటక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఉద్దీపనలు ప్రకటిస్తేనే అది కూడా సాధ్యమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు పోయినట్లే అన్నారు. జీడీపీ పెరగాలంటే సీఐఐ ద్వారా పది సూత్రాలను కేంద్రానికి ప్రతిపాదించామని చెప్పారు. కేంద్రం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ఉద్దీపన బాగుందని, కానీ మరిన్ని కావాలన్నారు.


Click it and Unblock the Notifications