ఈ క్యాలెండర్ ఇయర్ (2020) మొదటి క్వార్టర్‌లో (జనవరి - మార్చి) ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఐదు ప్రధాన నగరాల్లో సగటున 3 శాతం పెరిగిందని, అయినప్పటికీ ధరలు మాత్రం 8 శాతం పెరిగాయని అమెరికాకు చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ వెస్టియన్ రిపోర్ట్ తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో డిమాండ్ తగ్గి, ధరలు పెరిగినట్లు తెలిపింది.

కార్యాలయ స్థలానికి డిమాండ్ తగ్గి, అద్దె వ్యాల్యూపై ప్రభావం
ప్రస్తుతం కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ పైన భారీ ప్రభావం పడింది. పైగా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గు చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కార్యాలయ స్థలానికి స్వల్పకాలంలో మరింత డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ వైరస్ కారణంగా అద్దె విలువలో పెరుగుదల కూడా భారీగా నెమ్మదిస్తుందని అంచనా వేసింది ఈ రిపోర్ట్.

హైదరాబాద్, బెంగళూరు సహా ఎంత పెరిగాయంటే
ఈ రిపోర్ట్ ప్రకారం ఐదు నగరాల సగటు అద్దె విలువలు ఏడాదిలో 0-8 శాతం మధ్య పెరిగాయి. నెలవారీ సగటు ప్రకారం బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 8 శాతం చొప్పున పెరిగాయి. బెంగళూరులో రూ.75.5(sq ft), హైదరాబాద్‌లో రూ.62(sq ft)గా ఉంది. చెన్నైలో 5 శాతం పెరిగి రూ.60, ముంబైలో 2 శాతం పెరిగి రూ.125 ఉంది. కోల్‌కతాలో మాత్రం రూ.48 ఉండగా అలాగే ఉంది.

కరోనా వల్ల పడిపోయింది
బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో 2020 జనవరి - మార్చి నెల మధ్య దాదాపు 9.18 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయాలను అద్దెకు తీసుకున్నాయి కంపెనీలు. 2019లో ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం తక్కువ. మొదటి రెండు నెలల్లో ఎక్కువగా అద్దెకు తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చిలో పడిపోయింది.

ఏ నగరంలో ఎంత
బెంగళూరులో 11 శాతం తగ్గి 35.3 లక్షల చదరపు అడుగులు, కోల్‌కతాలో 57 శాతం తగ్గి 1.5 లక్షల చదరపు అడుగులు, హైదరాబాదులో 25 శాతం తగ్గి 16.4 లక్షల చదరపు అడుగుల డిమాండ్‌కు పరిమితమైంది. ముంబైలో మాత్రం 31 శాతం పెరిగి 29.3 లక్షల చదరపు అడుగులు, చెన్నైలో 23 శాతం పెరిగి 14.7 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. 5 నగరాల్లో కలిపి 75 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్థలాలు సిద్ధమయ్యాయి. ఏడాది కిందటితో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ.


Click it and Unblock the Notifications