EPFO: రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO ఈ ఏడాది ఫిబ్రవరిలో 13.96 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్‌లను నమోదు చేసింది. గురువారం విడుదల చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాత్కాలిక పేరోల్ డేటాలో ఈ మేరకు హైలైట్ చేసింది. కొత్త సభ్యుల్లో దాదాపు 7.38 లక్షల మంది తొలిసారిగా EPFO పరిధిలోకి వచ్చారని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కొత్తగా చేరిన సభ్యుల్లో అత్యధికంగా 2.17 లక్షల మంది 18-21 ఏళ్ల వయస్సు గలవారు కాగా, 1.91 లక్షల మంది 22-25 ఏళ్ల మధ్య వయస్కులని కేంద్రం తెలిపింది. ఫిబ్రవరిలో నమోదైన మొత్తం కొత్త సభ్యుల్లో 18-25 సంవత్సరాలున్న వారు 55.37 శాతం మంది ఉండటం విశేషం. అయితే దేశంలోని సంఘటిత రంగంలోకి అడుగిడిన మెజారిటీ సభ్యులు మొదటి సారి ఉద్యోగార్ధులు అని పేర్కొంది.

దాదాపు 10.15 లక్షల మంది సభ్యులు EPFO సభ్యత్వంలో తిరిగి చేరారని, గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8.59 శాతం పెరిగిందని కార్మిక శాఖ విడుదల చేసిన డేటా చెబుతోంది. అయితే వీరు గత కంపెనీలో ఫైనల్ సెటిల్ మెంట్ కోసం ధరఖాస్తు చేయడానికి బదులు వారి అకౌంట్లను బదిలీ చేసుకున్నవారని పేర్కొంది. లింగం వారీగా చూస్తే, నికర మహిళా సభ్యుల నమోదు 2.78 లక్షలు ఉండగా.. ఆ నెలలో మొత్తం చేరిన మెంబర్స్ లో వారి వాటా 19.93 శాతమని వెల్లడించింది. వ్యవస్థీకృత వర్క్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్య ధోరణిని ఈ డేటా సూచిస్తోందని చెప్పింది.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో నికర సభ్యుల చేరికలో ట్రైండ్ నెలవారీగా పెరుగుతోంది. నికర సభ్యుల చేరిక విషయానికొస్తే మాత్రం మొదటి 5 స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ మరియు ఢిల్లీలు ఉన్నాయి. ఇవి కలిసి ఫిబ్రవరి చేరికల్లో 58.62 శాతాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 20.90 శాతం కాగా తమిళనాడు 11.92 శాతంతో రెండో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications