మీరు ఏడాదిగా బ్యాంకు ఖాతాను వాడటం లేదా? అయితే ఏమవుతుందో తెలుసా?
ఈ రోజుల్లో చాలా మందికి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉండటం సహజంగా మారిపోయింది. తమకు అందుబాటులో ఉన్న లేదా ఎక్కువ వడ్డీ రేటు, ఇతర ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉన్న సమయంలో ఒకటికి మించి బ్యాంకు ఖాతాలను తెరుస్తుంటారు. ప్రైవేట్ రంగంలో చాలా మంది ఉద్యోగాలు తరచూ మారుతుంటారు. ఇలాంటి సమయంలో పాత ఖాతాని అలా వదిలివేసి కొత్త బ్యాంకు ఖాతాను తెరుస్తారు. పాత ఖాతా గురించి మరిచిపోతారు. వీటి నిర్వహణ లేకపోవడం వల్ల అవి అలాగే ఉండిపోతాయి. ప్రస్తుతం ఇలా ప్రభుత్వ, ప్రయివేట్, విదేశీ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఇతర బ్యాంకులలో కోట్లాది ఖాతాలు ఉన్నాయి. వీటిలో వేల కోట్ల రూపాయల సొమ్ము అలాగే ఉండిపోయింది. ఈ సొమ్మును అన్ క్లైమ్డ్ డిపాజిట్లుగా పేర్కొంటారు. అంటే ఈ ఖాతాల్లో ఉన్న సొమ్మును ఎవరు తీసుకోవడం లేదన్న మాట.

ఎంత సొమ్ము ఉందంటే..
ప్రస్తుతం బ్యాంకుల వద్ద ఖాతాదారులు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఉన్న ఖాతాల సంఖ్య 4.7 కోట్లకు పైగా ఉన్నట్టు భారత రిజర్వ్ బ్యాంకు గణాంకాల ద్వారా వెల్లడయింది. వీటిలో డిపాజిట్ల మొత్తం 14,307 కోట్ల రూపాయలకు పైగా ఉంది. చాలా మంది తమ ఖాతాల్లో తక్కువ సొమ్ము ఉందని ఆ ఖాతాల జోలికి వెళ్ళరు. వీటిలోని భారీ స్థాయిలో సొమ్ము అలా మిగిలిపోతోంది. అనేక మంది తమకు అవసరం లేకపోయినా ఆ ఖాతాను క్లోజ్ చేయకుండా అలాగే కొనసాగిస్తున్నారు. దీని వల్ల నిర్వహణలో లేని ఖాతాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కొంత మంది ఖాతాదారులు చనిపోతున్నారు. వారి ఖాతాలు కూడా అలాగే నిర్వహణ లేకుండా మిగిలిపోతున్నాయి.

ఏడాది లావాదేవీలు నిర్వహించకుంటే...
ఒకరికి మించి ఖాతాలు ఉన్నప్పుడు వాటిని కొంతకాలం పాటు నిర్వహించినా తర్వాత మాత్రం వాటి నిర్వహణ గురించి మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఏడాది గడిస్తే ఆ ఖాతా ఇనాక్టివ్ గా మారిపోతుంది. అది అలాగే కొనసాగి మరో పన్నెండు నెలలు గడిస్తే అప్పుడు అది ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాగా మిగిలిపోతోంది.

ఇలాంటి ఖాతాలతో నష్టమే...
ఎలాంటి లావా దేవీలు నిర్వహించకుండా ఉండే ఖాతాల వల్ల ఖాతాదారులకు లాభం ఉండకపోగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండవచ్చు. సాధారణంగా ఖాతాల్లో ఉండే సొమ్ము మీద నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది. దీనివల్ల ఏమి లాభం. ఒకవేళ ఈ ఖాతాలో ఉండే సొమ్మును ఎక్కువ రాబడి ఇచ్చే దానిలో పెట్టుబడిగా పెట్టినా కొంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని గమనించాలి. ఎక్కువ కాలం లావాదేవీలు నిర్వహించ కుండా ఉన్న ఖాతాలను ఎవరైనా బ్యాంకు ఉద్యోగులు దురాలోచనతో నిధుల బదిలీకి వినియోగించే ప్రమాదం ఉండవచ్చు. ఇలాంటి ఉదంతాలు ఇంతకు ముందు వెలుగు చూశాయి. ఒకవేళ అలా జరిగితే మీకు ఇబ్బందులు తలెత్త వచ్చు. లావాదేవీలు నిర్వహించకుండా ఉన్నప్పటికీ బ్యాంకులు మీ వద్ద నుంచి వార్షిక బ్యాంకు చార్జీలను ముక్కు పిండి మరీ వసూలు చేస్తాయి. కనీస నిల్వ లేనందుకు మీకు జరిమానాలు కూడా విధించడానికి అవకాశం ఉంటుంది మరి.

ఇలా ఆ సొమ్ము తీసుకోవచ్చు..
భారత రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం బ్యాంకులు పదేళ్లుగా లావాదేవీలు నిర్వహించకుండా ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను తమ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలి. ఒకవేళ అందులో మీకు సంబంధించిన ఖాతా వివరాలు ఉంటే మీకు సంబందించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి మీ ఖాతాలో సొమ్మును పొందవచ్చు. ఒక వేళ చనిపోయిన వారి ఖాతా నుంచి సొమ్ము తీసుకోవాల్సి వస్తే వారసత్వానికి సంబంధించిన వివరాలతో పాటు ఖాతాదారు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. పదేళ్లయినా ఎవరు ఖాతా లోని డిపాజిట్ల గురించి అడగక పోతే ఆ సొమ్మును డిపాజిటుదారుల విద్య, అవగాహన నిధి కి బదిలీ చేస్తారు. దీనికి బదిలీ చేసినా కూడా డిపాజిట్ దారు తనకు సంబందించిన వివరాలు అందించడం ద్వారా దీని నుంచి సొమ్మును పొందవచ్చు.


Click it and Unblock the Notifications